ఆంధ్రాలో ఆగని కరోనా.. ఒక్క కర్నూలు జిల్లాలోనే 996 కేసులు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వద్ద 12 ఏళ్లనుంచి గన్ మెన్ గా పని చేస్తున్న సురేష్ కొవిడ్ తో మృతి చెందారు. దాంతో ఎమ్మెల్యేకు, మిగిలిన అంగరక్షకులకు పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు నెగిటివ్ రాగా మిగిలిన వారికి పాజిటివ్ రావడంతో అందర్నీ హోం క్వారంటైన్ చేశారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో వైద్య విద్యనభ్యసిస్తున్న ముగ్గురు పీజీ విద్యార్ధులకు పాజిటివ్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు పంచాయతీ శివారు సూర్యారావుపేటలో ఆదివారం 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం అక్కడ పాజిటివ్ కేసులు 40 కు చేరుకుంది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఇద్దరు రిమాండ్ ఖైదీలకు కరోనా సోకంది. ఆదివారం ఒక్క రోజే ఇక్కడ 36 పాజిటివ్ కేసులు వచ్చాయి. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 51 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 996. ఆదోనీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించారు. ఇక్కడ ఆదివారం ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 29కి చేరుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com