"పెదరాయుడు"కి పాతికేళ్ళు

పెదరాయుడుకి పాతికేళ్ళు

విలన్ గా, హీరోగా, నిర్మాతగా 45 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ సినీ కెరీర్ మోహన్ బాబు జీవితం. ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి, హిట్లు, సూపర్ హిట్లు అందుకుని కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు, తన నటనతో ప్రేక్షకుల చేత నట ప్రపూర్ణ అనిపించుకున్నాడు, అదిరిపోయేలా డైలాగ్స్ చెప్పి డైలాగ్ కింగ్ గా చప్పట్లు కొట్టించుకున్నారు. ఆయన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా పెదరాయుడు. 1995 జూన్ 15న విడుదలై సంచలన విజయాన్ని సాధించిన పెదరాయుడు నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. హిట్లు సూపర్ హిట్లు ఏ హీరో కెరీర్ లో అయినా ఉంటాయి. కానీ పెదరాయుడు లాంటి చరిత్ర సృష్టించిన సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంది. హీరోగా, నిర్మాతగా కాస్త డౌన్ లో ఉన్నప్పుడు వచ్చిన పెదరాయుడుతో మోహన్ బాబు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆబాల గోపాలాన్ని అలరించిన పెదరాయుడు అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలను మార్చివేసింది.

పెదరాయుడు సినిమాని తన సొంత ప్రొడక్షన్ హౌస్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు మోహన్ బాబు. తనతో ఎమ్.ధర్మరాజు ఎమ్.ఎ చిత్రాన్ని తీసిన రవిరాజ్ పినిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన నాట్టామై చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమాని రీమేక్ చేయమని చెప్పింది. రైట్స్ ఇప్పించింది మరెవరో కాదు మోహన్ బాబు స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్. పెదరాయుడు సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. లవ్, సెంటిమెంట్, పాటలు, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్... వీటితో పాటు మంచి మెస్సేజ్ కూడా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అనురాగం ఎలా ఉండాలో చూపించింది ఈ సినిమా. భార్యభర్తల మధ్య బంధం ఎలా ఉంటే జీవితం బాగుంటుందో చూపించింది ఈ సినిమా. అందుకే సినిమా విడుదలై పాతికేళ్ళు అయినా ఇంకా మనం దాని గురించి చెప్పుకుంటున్నాం.

పెదరాయుడు సినిమా కథ గురించి చెప్పాలంటే... పెదరాయుడు గ్రామ పెద్ద. తన వంశపారంపర్యంగా వచ్చిన బాధ్యతను తాను తీసుకుని గ్రామంలో ఎదైనా సమస్యలు ఎదురైతే ధర్మాన్ని అనుసరించి తీర్పులు ఇస్తుంటాడు. పెదరాయుడుకి ఇద్దరు తమ్ముళ్ళు. పెదరాయుడు మేనత్త కొడుకు వల్ల, పెదరాయుడు తన తమ్ముడు రాజాపై తప్పు తీర్పు ఇవ్వడం. చివరికి అన్యాయాన్ని అంతం చేసి, తమ్ముడు చేయని తప్పుకి శిక్ష విధించానని తెలిసి మరణించడం. ఇది పెదరాయుడు కథ. కథ ప్రకారం ఇది కుటుంబ కథా చిత్రంలా కనిపించినా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా తెరకెక్కించాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. కుటుంబ బంధాలను అద్భుతంగా చూపిస్తూనే.... మాస్ ఆఢియన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండేలా చూసుకున్నాడు. ఏ హిట్ సినిమాలో అయినా ఇందులో బెస్ట్ సీన్ ఏది అంటే ఒకటి రెండు చెప్తాం. కానీ పెదరాయుడు అన్నీ బెస్ట్ సీన్సే అనేంతగా తన ప్రతిభం చూపించారు రవిరాజా పినిశెట్టి.

పెదరాయుడులో మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సి ఉంటుంది. నటనలోనూ, డైలాగ్స్ చెప్పడంలోనే తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న మోహన్ బాబు, ఈ సినిమాలో పెదరాయుడు పాత్రలో జీవించారు. ఆ పాత్రకు తగ్గ హుందాతనాన్ని ప్రతి సీన్ లోనూ చూపించారు. ఇక డైలాగ్స్ తో ప్రేక్షకులను మరోసారి మెప్పించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముఖ్యంగా తమ్ముడుకి భార్యభర్తల మధ్య సంబంధాన్ని చెప్పే సీన్ అద్భుతంగా ఉంటుంది. నటన పరంగా మోహన్ బాబు కెరీర్లో పెదరాయుడు మూవీ స్పెషల్ అని చెప్పాలి. ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు మోహన్ బాబు. పెదరాయుడుగా గెటప్ లో గానీ, ఆహార్యంలో గానీ కొత్త మోహన్ బాబుని చూపించాడు. గ్రామ పెద్దగా హుందాగా కనిపించాడు. తప్పు చేసినవాడు తన తమ్ముడైన సరే న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపంగా నిలబడే పాత్రలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందుకే ఇన్నేళ్ళైనా ఈ సినిమా గురించే కాక, మోహన్ బాబు నటన గురించి కూడా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.ఇక రెండో పాత్ర రాజాగా మోహన్ బాబు చురుకైన నటన కనబరిచాడు. అన్న మాటజవదాటని తమ్ముడుగా, ఆయన బాటలోనే నడితే పాత్రలో కనిపించి అలరించాడు.

పెదరాయుడు సూపర్ సక్సెస్ కి గల కారణాల్లో మరోకటి సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ అయ్యుండి అతిధి పాత్రకి ఒప్పుకోవడానికి మోహన్ బాబుతో ఉన్న స్నేహమే కారణం. అలాగే ఆ పాత్ర మీదున్న నమ్మకం. అందుకే గెటప్ దగ్గర్నుంచి, పెర్ఫార్మెన్స్ వరకు ది బెస్ట్ ఇచ్చి సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాడు రజనీకాంత్. పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్ పాపారాయుడు పాత్రలో నటించాడు. అంటే పెదరాయుడుకి తండ్రి. తన స్టైల్ తోనే సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఈ సినిమాలోనూ తనదైన స్టైల్స్ ని మిక్స్ చేసి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. తన క్యారెక్టర్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడంతో ఆ క్యారెక్టర్ మరింత ఎలివేట్ అయ్యింది... ఈ సినిమాలో భానుప్రియ పెదరాయుడుకి భార్యగా నటించింది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ భర్తకి తగ్గ ఇల్లాలిగా భానుప్రియ పాత్ర ఉంటుంది. అలాగే మరుదులు తన సొంత కొడుకుల్లా చూసుకునే పాత్రలో భానుప్రియ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా పెద్దవారంటే గౌరవం ఇవ్వకుండా తన మరదలకు బుద్దిచెప్పే సీన్ అద్భుతంగా ఉంటుంది. భానుప్రియ-సౌందర్యల మధ్య సాగే ఈ సీన్ చాలా బాగుటుంది. ఇక హీరోయిన్ గా నటించిన సౌందర్య తన చలాకీ నటనతో మెప్పించింది. బాగా డబ్బు ఉన్న అమ్మాయి అయినప్పటికీ పల్లెటూరి వాణ్ణి పెళ్ళిచేసుకుంటుంది. కానీ తన భర్త అన్నమాటకు జవదాటకపోవడం వంటి విషయాల వల్ల కాస్త పొగరుగా ప్రవర్తించే క్యారెక్టర్ లో సౌందర్య ప్రతిభ ఆకట్టుకుంటుంది. పెదరాయుడు కుటుంబం వల్ల తన తండ్రి అంతటి వాడయ్యాడని తెలిసి, తన తప్పుతెలుసుకునప్పుటి సీన్ లో సౌందర్య చక్కటి నటన కనబరిచింది.

ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అదే విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ లో తమిళ నటుడు ఆనంద్ రాజ్ సూపర్బ్ గా నటించాడు. పనమ్మాయిని తాను పెళ్ళి చేసుకోడానికి, 18 ఏళ్ళు తన కుటుంబాన్ని ఊరంతా వెలివేయడానికి, తన తండ్రి దిక్కులేని చావుకి పాపారాయుడే కారణమని పగబట్టిన పాత్రలో ఆనంద్ రాబ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. పెదరాయుడుకి మరో తమ్ముడు పాత్రలో రాజా రవీంధ్ర నటించాడు. అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజా రవీంధ్రకి పెదరాయుడులో చేసిన పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు ఇండస్ట్రీలో ఎదగడానికి కూడా ఉపయోగపడింది. పెదరాయుడు విజయానికి మరో కారణం మ్యూజిక్. కోటి ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక పాటలైతే సూపర్ హిట్ అయ్యాయి. మోహన్ బాబు, సౌందర్యల డ్యూయట్స్ తో పాటు, శ్రీమంతం సాంగ్ కదిలే కాలమా అనే పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. పెదరాయుడులో కామెడీ కూడా బాగానే ఉంటుంది. బ్రహ్మానందం, బాబు మోహన్ ల మధ్య సాంగ్ సీన్స్ ఆడియన్స్ ని నవ్వించాయి.

మంచి కథ, కథనం, రవిరాజు పినిశెట్టి దర్శకత్వ ప్రతిభ, రజనీకాంత్, మోహన్ బాబు, భానుప్రియ, సౌందర్యల బెస్ట్ పెర్ఫార్మెన్స్, కోటి మ్యూజిక్ ఈ సినిమాని టాప్ హిట్ గా నిలిపాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడంతో పెదరాయుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే ఈ చిత్రం 12 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే ఇఫ్పటి లెక్కల్లో చూస్తే ఇప్పుడు రికార్డ్స్ అని చెప్పుకుంటున్న చాలా సినిమా రికార్డ్స్ లిస్ట్ లో ఉండవేమో. అంతటి విజయాన్ని సాధించిన పెదరాయుడు ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉంది. అలరిస్తూనే ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story