సంక్షేమానికి పెద్దపీట వేశాం: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

సంక్షేమానికి పెద్దపీట వేశాం: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
X

బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్దపీట వేశామని చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకే నవరత్నాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 2 లక్షల 24 వేల 789 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు బుగ్గన. ఇందులో మూలధనం అంచనా వ్యయం 44 వేల 396 కోట్లు కాగా... రెవిన్యూ వ్యయం అంచనా ఒక లక్షా..80 వేల 392 కోట్లు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందని.. అనేక సమస్యలు, సవాళ్లు ఎదురుగా ఉన్నాయని చెప్పారు బుగ్గన.

2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందన్నారు బుగ్గన. గత ప్రభుత్వం చేసిన అప్పులు సునామీలా వచ్చి పడుతున్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో చెప్పిన 2 అంకెల వృద్ధి బూటకమని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా భారీగా తగ్గడం.. అదేసమయంలో కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయవనరులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయన్నారు. దీంతో ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయని చెప్పారు బుగ్గన. ఈ సవాళ్లను గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌ కోసం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు.

బడ్జెట్‌లో వ్యవసాయం, జలవనరులు, ఆరోగ్యరంగానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగానికి 11 వేల 891 కోట్లు, ఆరోగ్య రంగానికి 11 వేల 419 కోట్లు, జలవనరుల శాఖకు 11 వేల 805 కోట్లు కేటాయించారు. హోంశాఖకు ప్రత్యేకంగా 5 వేల 988 కోట్లు నిధులు ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం మొదటి సంవత్సరమే నెరవేర్చామని చెప్పారు బుగ్గన. పశుగాణాభివృద్ధి, మత్స్యరంగం, గృహ నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఐటీ, కార్మిక సంక్షేమం, పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు కూడా భారీగానే కేటాయింపులు చేశారు.

Tags

Next Story