వెర్సిటైల్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్ డే
డైరెక్టర్లకు స్టార్ డమ్ రావాలంటే వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలవాలి. వాళ్ళ సినిమాల్లో చేసిన హీరోలకు ఇమేజ్ మరింతగా పెరగాలి. ఇది ఒకటి రెండు సినిమాలతో రాదు. టైమ్ పడుతుంది. కానీ టాలీవుడ్లో రెండు మూడు సినిమాలకు స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో నిలిచిన దర్శకుడు కొరటాల శివ. కేవలం నాలుగు సినిమాలే తీసినా అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇవాళ కొరటాల శివ బర్త్ డే. దర్శకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. మాస్ బాటలో కొందరు, క్లాస్ రూట్ లో కొందరు సినిమాలు తీస్తారు. మరి కొందరు కామెడీ హైలైట్ గా సినిమాలు తీస్తారు. కానీ కొరటాల సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తన సినిమాలు క్లాస్ సినిమాలుగా కనిపించినా అందులో మాస్ ఎలిమెంట్స్ బాగా ఎలివేట్ అవుతాయి. అలాగే కామెడీ కూడా ఉంటుంది. వీటిన్నింటికి మించి మంచి మెస్సేజ్ కూడా ఇస్తాడు. అదే అతని సినిమాల్లో హైలైట్... అందుకే అతను తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
కొరటాల శివ రైటర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. గర్ల్ ఫ్రెండ్, భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, బృందావనం, సింహా, ఊసరవెల్లి చిత్రాలకు రైటర్ గా పనిచేశాడు. ఈ చిత్రాలతో రైటర్ గా గుర్తింపు వచ్చాక మిర్చితో మెగాఫోన్ పట్టాడు. ప్రభాస్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ మిర్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. తొలి సినిమాతోనే డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కొరటాల శివ. మిర్చి సినిమా కథ చూస్తే...నిజానికి ఆ స్టోరీ లైన్ తో గతంలో చాలా సినిమాలొచ్చాయి. రెండు కుటుంబాలు లేదా రెండు ఊళ్ళ మధ్య గొడవలతో మాస్ ఎంటర్టైనర్లు గతంలో వచ్చినప్పటికీ, కొరటాల శివ టేకింగ్ తో ఎట్రాక్ట్ చేశాడు. ప్రభాస్ ని న్యూ లుక్ లో చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అనుష్క క్యారెక్టర్ చలాకీగా ఉంటుంది. సత్యరాజ్, నదియా కీలక పాత్రలు పోషించారు. వీటితో పాటు పాటలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. దీంతో మిర్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మిర్చి తర్వాత కొరటాల శివకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్రంతోనే మైత్రీ మూవీస్ సంస్థ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. మహేష్ హీరోగా శృతీహాసన్ హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమానే శ్రీమంతుడు. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న మహేష్ ని, శ్రీమంతుడుతో సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు కొరటాల శివ. శ్రీమంతుడు సినిమా గ్రామాల దత్తత అనే పాయింట్ తో తెరకెక్కించాడు కొరటాల శివ. ఆర్ధికంగా బలంగా ఉన్నవాళ్ళు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది చేసే పాయింట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దానికి కొరటాల శివ రాసుకున్న సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో బిజినెస్ మాన్ కొడుకుగా, సెకండ్ హాఫ్ లో విలేజ్ లో ఉండే సీన్స్ లో మహేష్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి కూడా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. శృతీహాసన్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక శ్రీమంతుడు మహేష్ కి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.
మిర్చి, శ్రీమంతుడుతో రెండు భారీ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ మూడో సినిమా జనతా గ్యారేజ్ తో హాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జూనియర్ నటించిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ తో పాటు మంచి మెస్సేజ్ కూడా ఉంటుంది. ప్రకృతికి హానికరమైన ఏపనిని మనిషి చేయకూడదనే మెస్సేజ్ ఉంటుంది జనతా గ్యారేజ్ లో. జనతా గ్యారేజ్ కొరటాల శివ కెరీర్లోనే కాదు ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్. ఇక ఈ చిత్రంలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. కష్టం వచ్చిందని ఎవరు జనతా గ్యారేజ్ కి వచ్చినా, ఆ కష్టాన్ని తీర్చే పాత్రలో మోహన్ లాల్, ఎన్టీఆర్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సమంత, నిత్యామీనన్ ల పాత్రలు కూడా బావుంటాయి. ఈ సినిమాతోనూ కొరటాల శివ హాట్రిక్ హిట్ కొట్టాడు.
హాట్రిక్ హిట్స్ ఇచ్చిన జోష్ లో ఉన్న కొరటాల శివ...తన నాలుగో సినిమాని మళ్ళీ మహేష్ తోనే చేశాడు. అదే భరత్ అనే నేను. ఈ సినిమాని పొలిటికల్ థ్రిల్లర్ గా తీసాడు కొరటాల. నాయకులు ఎలా ఉండాలో, ఏ విధంగా పరిపాలించాలో భరత్ అనే నేను చిత్రంలో చూపించాడు కొరటాల. కరెక్ట్ గా ఎలక్షన్స్ టైమ్ లో రావడంతో ఈ సినిమా డైలాగ్స్...సీన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు శ్రీమంతుడుతో హిట్ ఇచ్చినట్లుగానే, మళ్ళీ రెండు ఫ్లాపులిచ్చిన మహేష్ ని భరత్ అనే నేనుతో సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు కొరటాల శివ. ఈ చిత్రంలో మహేష్ యంగ్ చీఫ్ మినిస్టర్ గా లుక్స్ పరంగానూ, పెర్ఫార్మెన్స్ పరంగానూ మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ, మహేష్ కి పర్ఫెక్ట్ పెయిర్ అనిపించింది. తన ప్రతి సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ భరత్ అనే నేనుకి కూడా సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ, ఇప్పుడు ఐదో సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా దేవాలయా భూముల ఆక్రమణల నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. అంటే ఇది కూడా మెస్సేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే రాబోతుంది. ఎప్పుడ దేవీతో మ్యూజిక్ చేయించుకునే కొరటాల, ఈ సినిమాకి మణిశర్మని తీసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతో త్వరలోనే ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. సో...ఇలా కేవలం నాలుగు చిత్రాలతోనూ స్టార్ డమ్ తెచ్చుకుని, స్టార్ హీరోలంతా తనతో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించేంతగా ఎదిగిన కొరటాలకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం...
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com