తెలంగాణలో కొత్తగా మరో 219 కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 189..

తెలంగాణలో కొత్తగా మరో 219 కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 189..

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 219 కేసులు నమోదయ్యాయి. ఒక్క GHMC పరిధిలోనే 189 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5 వేల 193కు చేరింది. ఇవాళ మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 187కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 వేల 766 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2 వేల 240 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల్లోనూ క్రమంగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 13 మందికి కరోనా సోకింది.. మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరికి వైరస్‌ సోకింది.. సంగారెడ్డిలో ఇద్దరు, వరంగల్‌ అర్బన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లిలో ఒక్కొక్క కేసు నమోదు కాగా, వరంగల్‌ రూరల్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. పది రోజుల్లోగా రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో 50 వేల టెస్టులు చేయాలన్న లక్ష్యంతో ముందకెళుతోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టుకు అనుమతిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడించారు. అలాగే కరోనా టెస్టులు, వైద్య సేవలకు కూడా ధరలు నిర్ణయించింది. కరోనా టెస్టుకు రూ. 2200, ఐసోలేషన్‌ బెడ్‌కు రోజుకు రూ. 4వేలు, వెంటిలేటర్‌ లేని ఐసీయూకు రూ. 7500, వెంటిలేటర్‌ అవసరం ఉంటే రూ. 9 వేలుగా ధరలు నిర్ణయించినట్లు ఈటెల తెలిపారు.

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండకుండా, స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో కరోనా పరీక్షల విధానం రూపొందించాలని పలువురు నిపుణులు గవర్నర్‌ తమిళిసైని కోరారు. వైరస్‌ వ్యాప్తి ఆధారంగా టెస్టింగ్‌ చేపట్టాలని, కాంటాక్ట్‌లను సమర్థంగా గుర్తించాలని అన్నారు. టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌ మాత్రమే దీర్ఘకాలంపాటు అనుసరించగల వ్యూహమన్నారు. కరోనాపై పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రంగాల నిపుణులతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. హాట్‌ స్పాట్లు, రెడ్‌ జోన్లలో అందరికీ పరీక్షలు చేయాలన్నారు. సామిజిక వ్యాప్తి గుర్తించడానికి యాంటీ బాడీ పరీక్షలు జరగాలన్నారు. హాట్‌ స్పాట్లలో ఒకే కిట్‌తో సామూహిక టెస్టులు చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధుల జాబితాలో కరోనాను కూడా చేర్చాలని వారు సూచించారు. రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు ప్రభుత్వం ఈ సలహాలు, సూచనలు వినియోగించుకునేలా స మగ్ర నివేదిక సమర్పిస్తామని గవర్నర్‌ చెప్పారు.

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఐసోలేషన్‌ వార్డులు.. క్వారంటైన్‌ సెంటర్లను అందుబాటులో ఉంచాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే 486 ప్రత్యేక కోచ్‌లను రైల్వేశాఖ సిద్ధం చేసింది. అలాగే 40 వేల ఐసోలేషన్‌ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రోగుల చికిత్స కోసం ఇప్పటికే వైద్య సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. గత వారం రోజులుగా నమోదవుతోన్నకరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు ప్రజా ప్రతినిధులు, అధికారులను సైతం కరోనా వదలడం లేదు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా సోకడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఆయనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా ఇప్పుడు సెల్ఫ్‌ క్వారెంటెన్‌లోకి వెళ్లారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పలువురు అదికారులతో పాటు స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

Tags

Next Story