తెలంగాణలో ఇప్పటివరకు 44,431 కరోనా టెస్టులు

తెలంగాణలో ఇప్పటివరకు 44,431 కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.. నిత్యం నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు వందలు దాటుతోంది.. గత వారం రోజులుగా కేసుల సంఖ్య విరీతంగా పెరుగుతోంది.. గడిచిన 24 గంటల్లో 213 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు 1251 శాంపిల్స్‌ పరీక్షించగా 213 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,406కు చేరింది.. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 261 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.. ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 3027కు చేరింది.. యాక్టివ్‌ కేసులు 2188గా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా కారణంగా నలుగురు చనిపోగా, మృతుల సంఖ్య 191కి చేరింది.

ఇక గతంలో కంటే భిన్నంగా కరోనా బులెటిన్‌ విడుదల చేస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్టులు, ఈరోజు జరిగిన టెస్టులతో కూడిన అన్ని వివరాలను బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.. ఇక జీహెచ్‌ఎంసీలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది.. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.. కొత్త కొత్త ప్రాంతాలకు కూడా వైరస్‌ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 165 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.. ఇక జనగాంలో ఒకటి, కామారెడ్డిలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.. కరీంనగర్‌ జిల్లాలో తాజాగా ఆరుగురికి కరోనా సోకింది.. ఆసిఫాబాద్‌లో ఒకరు, పెద్దపల్లిలో ఒకరు, సిద్దిపేటలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. రంగారెడ్డి జిల్లాలో 16, మెదక్‌ జిల్లాలో 13 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి.. నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 44,431 టెస్టులు చేసినట్లుగా బులెటిన్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.. ఇందులో 5406 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 కేంద్రాల్లో వైద్యులు శాంపిల్స్‌ సేకరించారు.. మొదటి, రెండో కాంటాక్ట్‌ వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శేరిలింగంపల్లి జోన్‌ నుంచి 210, కూకట్‌పల్లి జోన్‌ నుంచి 45, ఎల్బీనగర్‌ జోన్‌లో 240, సికింద్రాబాద్‌ జోన్‌లో 151, ఖైరతాబాద్‌ జోన్‌లో 575, చార్మినార్‌ జోన్‌లో 379 శాంపిల్స్‌ తీసుకున్నారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించుకున్నాయి.. ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ దిశగా ఆలోచన చేయకపోవడం, కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలే స్వీయ నియంత్రణ దిశగా ఆలోచన చేస్తున్నారు. జమ్మికుంటతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాపారులంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్‌తోపాటు అదే బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, ఆయన భార్యకు కరోనా సోకింది.. జమ్మికుంట మండలం కొరాపల్లిలో ఓ యువకుడికి, పక్కనే వున్న వీణవంక మండలం వల్బపూర్‌ గ్రామంలో నలుగురికి కరోనా రాగా ఒకరు మృతిచెందారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ పాటిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరవాలని తీర్మానం చేసుకున్నారు. ఇదే తరహాలో మరికొన్ని గ్రామాల్లో కూడా తీర్మానాలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story