డ్రాగన్ కుట్రలో బలైన తెలుగుతేజం

తెలుగుతేజం కన్నుమూసింది. భారతమాత సేవలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించింది. సూర్యాపేటవాసి దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందాడు. ఈ విషయం తెలిసి అతని కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. పుట్టింటివాళ్లు, మెట్టినింటివాళ్లు విషాదంలో మునిగిపోయారు. కల్నల్ మరణవార్త విని అతని అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దేశసేవలో తమ బిడ్డ అమరుడయ్యాడంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఆ ముగ్గురిలో కల్నల్ బిక్కుమల్ల సంతోష్ కూడా ఉన్నారు. కల్నల్ సంతోష్ సూర్యాపేటకు చెందిన వ్యక్తి. ఉపేందర్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సంతోష్ ఆ తర్వాత సైన్యంలో చేరారు. ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ స్థాయికి చేరుకున్నారు. ఏడాదిన్నర కాలంగా బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి లద్ధాఖ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. గాల్వన్ లోయలో బోర్డర్‌ను క్రాస్ చేయడానికి చైనా జవాన్లు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. చైనా సైనికులను నిలువరించడానికి కల్నల్ సంతోష్ వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలోనే తన ప్రాణాలను దేశమాతకు అర్పించారు.
సంతోష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లిదండ్రులు సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉంటున్నారు. భార్యా పిల్లలు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం వరకు కల్నల్ సంతోష్ మృతదేహాన్ని సూర్యాపేటకు తీసుకురానున్నారు. అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల చివరిచూపు తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com