వైసీపీ నేతల అవినీతి అక్రమాలు ఎవరికి చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్న ప్రజలు

వైసీపీ నేతల అవినీతి అక్రమాలు ఎవరికి చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్న ప్రజలు
X

ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు.. ఈ మాట వినడానికి బాగానే అనిపిస్తున్నా, ఆ ముసుగులో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను ఈప్రభుత్వం దౌర్జన్యంగా గుంజేసుకుంటోంది.. మరోవైపు రెండు మూడింతలు వెచ్చించి ప్రైవేటు భూములకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.. తూర్పుగోదావరి జిల్లాలో మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది.. జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం భూములను లాక్కునేందుకు ప్రయత్నించి తీవ్ర విమర్శల పాలయ్యారు అధికారులు. కాకినాడలో మడ అడవులు ధ్వంసం చేయడం, బూరుగుపూడి ఆవ భూముల్లో కోట్లాది రూపాయల అక్రమాలకు తెరలేపిన యంత్రాంగం తాజాగా కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గంలో మరో కుంభకోణానికి తెరలేపింది.

ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగి కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు బలంగా వినిపస్తున్నాయి.. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి గోదావరి నది ప్రవాహానికి అతి సమీపంలో ఉండటంతో కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు, విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. అయినప్పటికీ దీని గురించి పట్టించుకునే నాధుడే లేని పరిస్థితి. ఇవన్నీ తెలిసినా కొంతమంది నాయకులు, దళారీలు, అధికారులతో చేతులు కలిపి తక్కువ మొత్తంలో రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసి అదే భూమిని మళ్లీ ఎక్కువ మొత్తానికి ప్రభుత్వానికి విక్రయించి మిగిలిన సొమ్మును వాటాలు వేసుకుంటున్నారనే ఆరోపణలు వున్నాయి.. అయినవల్లి మండలంలోని పలు గ్రామాల్లో కళ్లెదుటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరుగుతూ కోట్లాది రూపాయలు దోచేస్తుంటే అంతా కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప స్థల యజమానులకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.

కొడుకుదురు పంచాయతీ పరిధిలోని గుణ్ణంమెరక, తొత్తరమూడి, శానపల్లిలంక గ్రామాల స్థల సేకరణలో ఇలాంటి అక్రమాలే జరిగినట్లు ఆరోపణలున్నాయి.. ఇదంతా మండల రెవెన్యూ శాఖలో ఇటీవల బదిలీపై వెళ్లిన ముఖ్య అధికారి కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. కొండుకుదురు, గుణ్ణం మెరక శివారు ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతానికి 100 మీటర్లలోపు దూరంలో ఉన్న 25/1 సర్వే నంబరులోని 2.9 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు నిర్ణయించింది.. ఇక్కడ ఎకరా 25 లక్షలు కూడా విలువ చేయదు.. అయితే, ఈ భూమిని అధికారులు 42 లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతోంది.

అదే విధంగా కె.జగన్నాథపురం, తొత్తుమూడి పంచాయతీల పరిధిలోని నేదునూరువారిపేట శివారులో ఏడెకరాల భూమిని ఇళ్ల స్థలాలకు సేకరించారు అధికారులు. ఇందులో కూడా లక్షలాది రూపాయలు చేతులు మారాయాని గ్రామస్తులే చెబుతున్నారు. పరోక్షంగా దీనిపై తొత్తుమూడి గ్రామంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వైపు సీఎం జగన్‌ అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తానని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదనే తెలుస్తోంది.. అయినవిల్లి మండలంలో కొంతమంది వైసీపీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గుణ్ణంమెరకలో సేకరించిన స్థలం వర్షాకాలంలో వరద ముంపునకు గురవడంతోపాటు విపరీతమైన నీటిఒడి ప్రాంతానికి పక్కనే ఉండటంతో కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి భూమిని లక్షలాది రూపాయలు వెచ్చించి ఎందుకు సేకరించారో రెవెన్యూ అధికారులకే తెలియాలి. ఇక్కడ స్థలం తీసుకుంటే లబ్ధిదారుల పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి.. దీనిపై కొందరు అధికార, ప్రతిపక్ష నేతలు త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story