చైనా యాప్స్ యమ డేంజర్.. ఇన్ స్టాల్ చేసుకున్నారో?

చైనా యాప్స్ యమ డేంజర్.. ఇన్ స్టాల్ చేసుకున్నారో?
X

చైనా యాప్స్ మహా డేంజర్ యాప్స్. ఫీచర్స్ బాగున్నాయని ఇన్ స్టాల్ చేసుకున్నారో...మీ ఫోన్లోని సమాచారం అంతా చైనాకు వెళ్లిపోతుంది. ఇలాంటి హెచ్చరికలు గతంలోనూ ఎన్నోసార్లు వినిపించాయి. డ్రాగన్ కంట్రీ యాప్ లను వాడితే మీకంటూ గోప్యత ఉండదని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే..ఈ సారి మాత్రం చైనా యాప్స్ తో ప్రమాదం అంటూ ఇంటలిజెన్స్ వర్గాలే ధృవీకరించాయి. చైనాకు చెందిన దాదాపు 52 యాప్స్ తో దేశానికి ముప్పు పొంచి ఉందని కేంద్రానికి సిఫారసు చేశాయి. భద్రతా సంస్థలకు చెందిన సిబ్బంది ఎవరూ ఆ 52 యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకుండా చూడాలని కూడా నిఘా విభాగం అధికారులు కేంద్రానికి సిఫార్సు చేశారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూళ్లన్ని జూమ్ యాప్ ద్వారానే విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నాయి. ఇక మన దేశంలో టిక్ టాక్ యాప్ కు బోలెడంత క్రేజ్ ఉంది. కానీ, ఈ యాప్ లన్ని యమడేంజర్ అన్నది ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 52 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంద‌ని చెబుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న చైనా యాప్ లకు సంబంధించి ఓ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి నిఘా విభాగం స‌మ‌ర్పించింది. అయితే..ఇంటలిజెన్స్ సిఫార్సులపై జాతీయ భద్రతా మండలి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

జూమ్ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం గోప్యతకు భద్రత ఉండదని గత ఏప్రిల్ లోనే కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు..ప్రభుత్వ సమావేశాలకు యాప్ వినియోగించకూడదని కూడా ఆదేశించింది. ప్రపంచంలోని పలు దేశాలు జూమ్ యాప్ పై వినియోగంపై ఇప్పటికే నిషేధం విధించాయి. జాతీయ భద్రతా మండలి..ఇంటలిజెన్స్ సిఫార్సులను ఆమోదిస్తే మన దేశంలోనూ జూమ్ యాప్ పై నిషేధం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిఘా వర్గాలు సూచించిన ఆ 52 యాప్ లు ఎంతవరకు ప్రమాదమనే అంశాలపై జాతీయ బద్రతా మండలిలో చర్చలు జరుగుతున్నాయి. చర్చల తర్వాత నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Tags

Next Story