చైనా వ్యాఖ్యలు తూట్లు పొడిచేలా ఉన్నాయి : విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

చైనా వ్యాఖ్యలు తూట్లు పొడిచేలా ఉన్నాయి : విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
X

గల్వాన్ తమదేనంటూ చైనా ప్రకటించుకోవడంపై భారత్ ఘాటుగా స్పందించింది. చైనా వ్యాఖ్యలను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. చైనా అలా చెప్పుకోవడం అతిశయోక్తి కలిగించిందన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. జూన్ 6న జరిగిన ఇరు దేశాల సైనికాధికారుల ఒప్పందానికి ఈ వ్యాఖ్యలు తూట్లు పొడిచేలా వున్నాయని అన్నారు.

మరోవైపు, గల్వాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, చైనా ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15, 16 తేదీల్లో గల్వాన్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు ఇరు దేశాల సైనిక వర్గాలు ప్రకటించాయి. ఇదే అంశంపై నిన్న కూడా ఇరుదేశాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసిందని సమాచారం.

ఇక, గల్వాన్‌లో భారత సైనికులపై చైనా ఆర్మీ ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడిందని విదేశాంగ శాఖామంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. బుధవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో మాట్లాడిన జైశంకర్.. చైనా ఇలాంటి చర్యలు మానుకోకపోతే ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. చైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.

ఇదిలావుంటే, గల్వాన్ ఘటన వెనుక చైనా కుయుక్తులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఘర్షణలకు సంబంధించి తాజాగా మరికొన్ని నిజాలు వెలుగుచూశాయి. ఘర్షణలకు ముందు చైనా భారీ సంఖ్యలో సైన్యాన్ని వాహనాల్లో గల్వాన్‌కు తరలించినట్టు.. శాటిలైట్ ఇమేజెస్‌ ద్వారా స్పష్టమవుతోంది. బలగాలతో పాటు, భారీగా టెంట్లు ఇతర సమాగ్రిని గల్వాన్ ప్రాంతానికి తరలించినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఇక, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత దృష్టా ఆర్మీ సంబంధిత వ్యవహారాల్లో చైనా ఉత్పత్తులను వాడొద్దని టెలికాం శాఖ సూచించింది. ముఖ్యంగా చైనా తయారు చేసిన 4G సహా.. ఇతర టెలికాం సామాగ్రిని వాడొద్దని BSNLకు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Next Story