లివింగ్ గార్డ్ మాస్క్.. 99.9 శాతం సేఫ్: శాస్త్రవేత్తల వివరణ

లివింగ్ గార్డ్ మాస్క్.. 99.9 శాతం సేఫ్: శాస్త్రవేత్తల వివరణ
X

కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లో మాస్కులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా మాస్కుల అమ్మకాలు సాగిస్తున్నారు. నిజానికి మాస్క్ ధరించడం అన్ని వేళలా మంచిదే.. బయటి దుమ్ము దూళి ముక్కులోకి, నోటిలోకి చేరకుండా ఉంటాయి. ఎవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు, వైరస్ కారకాలు దరి చేరకుండా ఉంటాయి. శుభ్రమైన వస్త్రాన్ని మాస్కులా ధరించినా సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వైరస్ ని నిర్వీర్యం చేసే మాస్క్ ని తయారు చేశామంటున్నారు లివింగ్ గార్డ్ సంస్థ వారు. స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ తయారు చేసిన మాస్క్ మిగిలిన మాస్క్ లకంటే ప్రత్యేకమైంది. మూడు పొరలతో రూపొందించిన ఈ మాస్క్ ఓ ప్రత్యేక వస్త్రంతో తయారైంది.

ఈ వస్త్రంపై కొన్ని రసాయనాలను పోగుపడేలా చేశారు. దీని వలన ఈ మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతుంది. సూక్ష్మజీవులన్నీ రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వైరస్ తో పాటు బ్యాక్టీరియా, మరి కొన్ని శిలీంధ్రాలు సైతం ఈ విద్యుదావేశం బారిన పడి నశిస్తాయి. ప్రతి చదరపు సెంటీమీటరుకు 3,600 కోట్ల విద్యుదావేశాలు పుడుతుంటాయి. కాబట్టి సూక్ష్మజీవులు వీటిని తాకిన వెంటనే నశిస్తాయని కంపెనీ సీటీవో, భారతీయ శాస్త్రవేత్త సంజీవ్ స్వామి బుధవారం ఓ వెబినార్ లో తెలిపారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ ఏ మషేల్కర్ కూడా ఈ వెబినార్ లో పాల్గొన్నారు. వెయ్యి వరకు పాలి కాటయానిక్ రసాయనాలను పరిశీలించిన మీదట అవసరమైన లక్షణాలున్న 3 నుంచి 7 వరకు రసాయనాలను ఎంపిక చేసి ప్రత్యేక పద్దతుల్లో కలిపి వస్త్రంపై అవి అతుక్కునేలా చేశామని స్వామి వివరించారు. వీటిని ఉతుక్కుని మళ్లీ వాడుకోవచ్చని తెలిపారు. ప్రముఖ యూనివర్శిటీలు ఈ మాస్కులను పరిశీలించి 99.9 శాతం సురక్షితం అని సర్టిఫికెట్ ఇచ్చిన మీదటే మార్కెట్లోకి తీసుకు వస్తున్నామని అన్నారు. కాగా వీటి ఖరీదు రూ.1,490 నుంచి 1,990 మధ్య ఉంటుంది. వారానికి ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా 210 రోజుల పాటు ఈ మాస్కును వాడొచ్చు అని తెలిపారు. మాస్కులతో పాటు గ్లౌజులు కూడా ధరిస్తే వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని అంటున్నారు. వారం రోజుల్లో ఆన్ లైన్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు.

Tags

Next Story