ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అవినీతి, అక్రమాలు!

ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అవినీతి, అక్రమాలు!
X

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జరుగుతున్న అవకతవకలు కలకలం రేపుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక వైసీపీ నేతలు భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తణుకు నియోజకవర్గంలోనూ వైసీపీ నేతల ముడుపుల వ్యవహారం కలకలం రేపుతోంది..

తణుకు నియోజకవర్గంలోని బాధితలబ్ధిదారులు ఏలూరు కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా ఇరగవరం మండలం రేలంగిలో ఒక్కో ఇంటి పట్టా కోసం 40 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారంటూ నాగలక్ష్మి, శాంతకుమారి అనే ఇద్దరు లబ్ధిదారులు కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో 60కిపైగా ఫిర్యాదు వచ్చాయన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న డబ్బును చెల్లించలేక పేదలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న ఇంటి స్థలం మంజూరయ్యేలా చూడాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్ల పట్టాల అక్రమాలపై ఏకంగా.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో... దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Tags

Next Story