పెళ్లై ఆర్నెల్లే అయింది.. లాక్డౌన్ తరవాత వస్తానన్నాడు.. అంతలోనే..

సైనికుల వీరమరణం దేశంతో పాటు కుటుంబ సభ్యులను ఎంతగానో కలచి వేస్తుంది. అమ్మలేదు.. అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. అయినా దేశానికి సేవ చేయాలన్న తపనతో సైన్యంలో చేరాడు. లాక్డౌన్ ముగిసిన తరువాత ఇంటికి వస్తానన్నాడు అంతలోనే అశువులుబాశాడు భారత సైనికుడు నాయక్ దీపక్ కుమార్ సింగ్. ఏడు నెలల క్రితం 2019 నవంబర్ 30న వివాహం చేసుకున్నాడు. భార్య రేఖా సింగ్ మధ్యప్రదేశ్ సిర్మౌర్ లోని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
దీపక్ సింగ్ తల్లి చాలా సంవత్సరాల క్రితమే కన్ను మూసిందని అమ్మమ్మ ఫూల్ కుమారి మనవడి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది. అందరితో చాలా ప్రేమగా ఉండేవాడని, ఇంట్లో అందరినీ గౌరవించేవాడని చెబుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అతడి మరణం గురించి మాకు ఆర్మీ అధికారులు చెప్పాడు.. అప్పటి నుండి గ్రామంలో చీకట్లు అలుముకున్నాయి అని దీపక్ కుటుంబం తెలిపింది. 2013లో ఆర్మీలో చేరిన దీపక్.. బీహార్ రెజిమెంట్ తో గాల్వన్ వ్యాలీ లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తండ్రి గజరాజ్ సింగ్ రైతు. దీపక్ అన్నయ్య ప్రకాష్ కూడా ఆర్మీలోనే పని చేస్తున్నారు. అతడు రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద పనిచేస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, వీరమరణం పొందిన దీపక్ కి.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాళులు అర్పించారు. దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ధైర్యాన్ని కనబరిచాడని, విధి నిర్వహణలో తన జీవితాన్ని అర్పించాడని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, బీజేపీ నాయకుడు గోపాల్ భార్గవ తదితరులు దీపక్ కు నివాళులు అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com