ఏపీ కేబినెట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయా..? మంత్రి పదవులు వీరికేనా?

ఏపీ కేబినెట్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఇద్దరి స్థానాల భర్తీపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మంత్రి పదవులను జగన్ ఎవరికి కట్టబెడతారన్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటు కేబినెట్‌లో బెర్త్ కోసం సీనియర్లు, జూనియర్లు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెకంటరమణ స్థానాల్లో ఎవరెవరికి ఛాన్స్ దొరుకుతుంది..? వైసీపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్.. కేబినెట్ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఎవరికి బెర్త్ లభిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. సీఎం జగన్ సామాజిక వర్గం, జిల్లాల వారీగా లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటారా..? సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన మంత్రులు కావడంతో ఆ స్థానాలను బీసీలకే ఇస్తారా..? బీసీల్లో అదే కులానికి చెందిన నేతలకు ఇస్తారా..? లేక ఖాళీగా వుంచుతారా అన్నది కూడా తేలాల్సి ఉంది.
ఇక్కడే సామాజిక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.. మోపిదేవి కులానికే చెందిన సతీష్‌బాబుకు మంత్రిపదవి ఇస్తారా..? పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికే ఇవ్వాలనుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో వేణు వున్నారు.. అయితే, ఈ పోటీలో అసలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరికీ కొత్తగా రాకపోవచ్చే చర్చ కూడా జరుగుతోంది.. బోసు వర్గానికే సంబంధించి జోగి రమేష్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే, కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నందున మరో పదవి దక్కే ఛాన్స్ లేదు.. కృష్ణా జిల్లాలో కొడాలి నానిని తప్పిస్తే తప్ప మరొకరికి అవకాశం రాదనే ప్రచారం జరుగుతోంది. ఇక సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎంగా ఉన్నందున అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్లను పదవి కేటాయించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.. జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే డిప్యూటీ సీఎం కోటాలో బీసీ మంత్రికే ఆ హోదా ఇస్తారా లేక ధర్మాన కృష్ణదాసు వంటి వారికి అవకాశం కల్పిస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇక మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లాకు చెందిన నేత. దీంతో మోపిదేవి స్థానంలో ఎవరికి పదవి వస్తుందోనన్న చర్చ మొదలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వచ్చాయి. వీరిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని కూడా ఉన్నారు. ఆమె బీసీ కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. విడదల రజిని బీసీ కాడం, మోపిదేవి కూడా బీసీ కావడంతో గుంటూరు జిల్లాలో బీసీలకే మళ్లీ పదవి ఇవ్వాలనుకుంటే రజినీకి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే విడదల రజినిని గెలిపిస్తే టిక్కెట్టు రేసులో ఉన్న మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని గత ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.. కానీ, జగన్ ఇప్పుడు మండలినే రద్దుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. మరి, మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ ఎలా చేస్తారు..? మంత్రి పదవి ఎలా ఇస్తారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇక జంగా కృష్ణమూర్తి సంగతి ఏంటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.
ఇక మంత్రి పదవిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని స్వయంగా జగనే ప్రకటించారు. అయితే, కొన్ని సామాజిక సమీకరణాలతో ఆయనకు మంత్రి పదవి దూరమైంది. తర్వాత నామినేటెడ్ పదవి ఏదైనా ఇస్తారని కూడా చర్చ జరిగింది.. అదీ జరగకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా జగన్ తనకు ప్రాధాన్యం ఇస్తారని ఆయన భావిస్తున్నారు. కానీ సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆళ్లకు పదవి కష్టమనే చర్చ జరుగుతోంది.. ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపినందున ఆర్కే కోటా అయిపోయినట్లేననే వాదన వినిపిస్తోంది. ఇక రాయలసీమలోని రెడ్డి వర్గం ప్రాతినిధ్యం లేని అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పేరు, చిత్తూరు నుంచి రోజా పేర్లు కూడా వినబడుతున్నాయి.. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున రోజాకు కష్టమే అంటున్నారు. మొత్తంగా జగన్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com