అనంతలో నాసిరకం విత్తనాల సరఫరా.. రైతులకు కన్నీరే మిగిలింది..

అనంతపురం. ఏపీలో కరువు కేంద్రంగా ఉన్న జిల్లా ఇది. సాగు నీటి సదుపాయాలు ఉండి లేనట్లుగానే ఉంటాయి. నాలుగు చినుకులు పడితే కానీ, సాగు కుదరదు. అందుకే అనంతపురం జిల్లాలో ఏడాదికి ఒకే పంట. అది కూడా వర్ష ఆధారిత పంటలే. కాలం కలిసి వస్తే దిగుబడి. లేదంటే ఆకాశం వైపు చినుకు కోసం ఎదురు చూడాల్సిన దుర్భర పరిస్థితి. ఇంతటి కష్టాల్లోనూ ఇక్కడి రైతులు ప్రతి ఏటా వేరుశనగ పండిస్తుంటారు. ఆ పంటపైనే రైతుల జీవనం ఆధారపడి ఉంటుంది.
కానీ, ఇక్కడి రైతులను కరువు, చీడపురుగుల కంటే..అధికారుల అవినీతికి ఎక్కువగా బలైపోతున్నారు. ఈ సారి కూడా అదే జరిగింది. జిల్లాలో మొత్తం ఏడున్నర లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుంది. అయితే..ఈ సారి అనుకున్న సమాయానికే తొలకరి పలకరించింది. నైరుతి రుతుపవనాలతో ఆశాజనకంగా కాలం అయ్యింది. కానీ, సకాలంలో విత్తనాలు అందక కొన్ని ప్రాంతాల్లో విత్తనాల సాగు ఆలస్యం అయ్యింది. అయినా..ఎదో రకంగా విత్తనాలు దక్కించుకొని ఎన్నో ఆశలతో సాగు చేసుకున్న రైతులకు ఇప్పుడు కన్నీరే మిగిలింది. నాసిరకం విత్తనాలను సరఫరా చేయటంతో పంట చేళ్లలో అసలు వేరుశనగ మొలకలే రాలేదు. విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. దున్నిన భూములన్ని బీళ్లను తలపిస్తున్నాయి.
నాసిరకం విత్తనాలను సరఫరా చేయటం అంటే రైతులను హత్య చేయటమే. వారిని ఆర్ధికంగా క్షోభపెట్టడమే. తమది రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం హాయంలో అనంతపురం రైతుల భవిష్యత్తు ఆయోమయంలో పడింది. వివిధ ఏజెన్సీల ద్వారా విత్తన వేరుశనగలను సేకరించిన రైతులకు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఆ విత్తనాలలో 9 శాతం తేమ ఉండాల్సి ఉండగా..కేవలం 4 శాతం మాత్రమే తేమ ఉందని..అందుకే మొలకలు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
విత్తనాలు నాసిరకం అని గుర్తించి కొందరు రైతుల ఆగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించి..వాటిని తిరిగి ఇచ్చినా..తర్వాత కూడా అదే తరహా నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టారు. దీంతో విత్తులు నాటిన ఈ భూములన్ని ఇంకా బీళ్లుగానే కనిపిస్తున్నాయి.
నాసిరకం విత్తనాల పంపిణీపై మే 23నే జిల్లాలోని వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కానీ, అధికారులు చర్యలు తీసుకోకపోగా..విత్తనాల నాణ్యతను ఎవరూ తనిఖీ చేయవద్దంటూ కింది స్థాయి అధికారులకు ఆదేశించారని లెఫ్ట్ పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో ఏడాది వచ్చే ఒకే ఒక్క పంట. నాసిరకం విత్తనాలతో ఇప్పుడు ఆ పంట కూడా లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా..ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. రైతుల సంక్షేమం అంటూ పెద్ద మాటలు చెప్పే ప్రభుత్వాల హాయంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని రైతులు నిలదీస్తున్నారు. నాసిరకం విత్తనాలతో నష్టాల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక నష్టపరిహారాలు ప్రకటించటం కాదు..రైతు చావుకు కారణాలు ఎంటో తెలుసుకోవాలని కోరుతున్నారు. పంట చేళ్లలోని చీడపురుగుల సంగతి మేం చూసుకుంటాం..వ్యవస్థలోని చీడపురుగుల భరతం మీరు పట్టండి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
విత్తానాల నాణ్యత విషయంలోనే కాదు..విత్తన వేరుశనగ సేకరణలోనూ విస్తు గొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో లక్షల హెక్టర్లలో సాగయ్యే వేరుశనగ పంట కోసం దాదాపు 2 లక్షల 80 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగను జిల్లా వ్యవసాయ శాఖ సేకరించింది. 90 వేల క్వింటాళ్లను నేరుగా రైతుల దగ్గర్నుంచి సేకరించగా..మిగిలిన లక్షా 90 వేల క్వింటాళ్లను ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ లాంటి వివిధ ఏజెన్సీల ద్వారా సేకరించింది.
సేకరించిన విత్తన వేరుశనగలను జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడిపై రైతులకు పంపిణీ చేశారు. కానీ, నాసిరకం విత్తనాలతో ఇంకా మొలక రాలేదు. అసలు విత్తన సేకరణ సమయంలో పెద్ద స్కాం జరిగినట్లు లెఫ్ట్ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. విత్తనాల సరఫరా కోసం విత్తన వేరుశనగలను కొనుగోలు చేసిన అధికారులు తొలుత క్వింటాల్ కు 4,500 నుంచి 5,400 వరకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అదే విత్తనాలను 7,100 నుంచి 8,100 ధరతో కొనుగోలు చేశారని జిల్లా సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గోల్ మాల్ వ్యవహారంతో దాదాపు 30 కోట్ల మేర స్కాం జరిగిందన్నది సీపీఎం నేతల వాదన.
అయితే..జేడీ మాత్రం సీపీఎం ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. అంతా సక్రమంగానే, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే విత్తన కొనుగోలు, విత్తనాల సరఫరా జరిగిందని చెబుతున్నారు. విత్తనాలు అమ్మిన రైతులకు బ్యాంక్ అకౌంట్లో నగదు కూడా జమ చేశామని చెబుతున్నారు. అవినీతికి పాల్పడినట్లు ఏ ఒక్క ఆధారం ఉన్నా..ఏ శిక్షకైనా సిద్ధమేనని అంటున్నారు జేడీ.
అయితే..సీపీఎం నేతలు మాత్రం జేడీ సవాళ్లు మేకపోతు గాంభీర్మేనని అంటున్నారు. నాసిరకంపై ఫిర్యాదు చేస్తే..నాణ్యతను తనిఖీ చేయొద్దంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు రావటం..అదే సమయంలో విత్తన సేకరణలో జరిగిన అక్రమాలను గమనిస్తే..దీని వెనక పెద్ద తలలే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సీపీఎం నేతలు. విత్తన సేకరణ కొనుగోళ్లు..నాసిరకం విత్తనాల సరఫరాపై తగిన దర్యాప్తు జరిపిస్తే అసలు దొంగలు బయటకు వస్తారని అంటున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 30 కోట్లు దిగమింగితే..ఇక రాష్ట్రం అంతా లెక్క చూసుకుంటే విత్తన కొనుగోళ్ల కుంభకోణం భారీ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు. అయితే..అనంతపురంలో జరిగిన అవినీతి అంతటికీ జేడీ కారణమని..ఆయన కనుసన్నలోనే ఈ అక్రమాలు జరిగాయని చెబుతన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com