ఏపీలోని మూడు జిల్లాల్లో మళ్ళీ లాక్‌డౌన్

ఏపీలో శుక్రవారం ఒకేరోజు 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 7,961కి పెరిగింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతుండటంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని 8 మండలాల్లో లాక్‌డౌన్ విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి వారం పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ విధిస్తున్నారు. అటు ప్రకాశంలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో నిన్నటి వరకు 296 కేసులు నమోదయ్యాయి. ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు వచ్చాయి. చీరాల పరిసరాల్లో 47 కేసులు వచ్చాయి. దీంతో ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలోనూ లాక్‌డౌన్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది. అక్కడ 200 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువుకు ఆ తర్వాత వైరస్ సోకినట్లు తేలింది. దీంతో పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. అంతకుముందే మందసలో ఓ వ్యక్తి వైరస్ సోకి మరణించడం, సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com