చైనా సరిహద్దుల్లో మోహరించిన యుద్దవిమానాలు

గల్వాన్ ఘటనతో భారత్, చైనా సరహద్దుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనా కుయుక్తులను ఎదుర్కొందుకు భారత్ సర్వసన్నద్దమైంది. సైన్యం అమ్ముల పొదిలో ఉన్న అతి భయంకరమైన యుద్దవిమానాలను కీలక ప్రాంతాల్లో మోహరించింది. మరుక్షణం రంగంలోకి దిగేందుకు సర్వసన్నద్దమైంది. శ్రీనగర్, అవంతిపొర, లేహ్ ప్రాంతాల్లో సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్ 2000, జాగ్వార్ యుద్ద విమానాలను శ్రీనగర్, అవంతిపొర, లేహ్ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నాయి. మరుక్షణమే దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అమెరికా నుంచి తెప్పించిన అధునాతన అపాచీ హెలికాప్టర్లనూ చైనా సరిహద్దుల్లో మోహరించింది. వీటికితోడు అతి తక్కువ సమయంలోనే ఎగిరేలా సుఖోయ్ 30ఎంకేఐ, మిరేజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలను ఐఏఎఫ్ సరిహద్దుకు తరలించింది. సైనికులకు అనుకూలంగా ఎంఐ-17వీ5 మీడియం లిఫ్ట్ ఛాపర్లను వినియోగిస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా భారత అధీనంలోని లద్దాఖ్ సమీప ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు ఎగిరేందుకు ప్రయత్నించడంతో హోతన్, గార్ గున్సా వద్ద 14వేల అడుగుల ఎత్తున భారత వాయుసేన ఎస్‌యు-30 యుద్ధ విమానాలను మోహరించింది.
లద్దాఖ్ లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన గల్వాన్ లోయలో పరిస్థితి నిగురుగప్పిన నిప్పులా తయారైంది. చైనా ఎలాంటి ఎత్తుగడలనైనా ఎదుర్కొనేందుకు సైనిక దళాలను మోహరించడంతో పరిస్థితి గుంభనంగా మారింది. ఒకవైపు సైన్యం, మరోవైపు వాయుసేన విమానాలు, హెలికాప్టర్ల గస్తీతో యుద్దవాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పర్వత ప్రాంతాలు సైనిక కవాత్తుతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయితే వీటికి తోడు పరిస్థితిని బట్టి మరింత సైన్యాన్ని మోహరించేందుకు సన్నద్దమైంది. మన సైన్యానికి దీటుగా చైనా కూడా బలగాలను, యుద్దవిమానాలను మోహరించినట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదౌరియా జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లలో పర్యటించారు. వాయుసేన తీసుకున్న చర్యలనుపరిశీలించినట్లు తెలుస్తోంది.
చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. గల్వాన్ లోయలో భారత శిబిరాలకు కిలోమీటరు దూరంలో భారీగా మోహరింపులు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాలు ద్వారా తెలుస్తోంది. ఆ దేశ వైమానిక దళం రంగంలోకి దిగింది. టిబెట్‌లోని ఎంగారి వైమానిక స్థావరం వద్ద మౌలిక వసతులను భారీగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు పాల్పడిన పాంగాంగ్ సరస్సుకు చేరువలో ఈ స్థావరం ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు వైమానిక శిబిరంలోనూ చైనా తన యుద్ధవిమానాలను మోహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మన వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.
దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. మన ప్రాంతాల్లోకి ఎవరు చొరబడలేదన్నారు. లద్ధాఖ్‌లో ఆత్మబలిదానం చేసిన వీర జవాన్లు... భారత్ వైపు కన్నెత్తి చూసినవారికి గుణపాఠం నేర్పారని అన్నారు. సరిహద్దు రక్షణలో మన సైన్యం పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేస్తోందన్నారు. దేశ రక్షణ పట్ల ఎవరికీ వీసమెత్తు అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించి గల్వాన్ ఘటన వివరాలను వివరించారు. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అండగా ఉంటామన్నారు. ఐకమత్యంతో చైనా ఆగడాలను తిప్పికొట్టాలని ప్రకటించారు. మరోవైపు గల్వాన్ ఘటన నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, పెట్టుబడులను బహిష్కరించాలంటూ భారత్‌లో వస్తున్న డిమాండ్‌పై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్ ఆచితూచి స్పందించారు. భారత్‌తో సంబంధాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి రెండు దేశాలూ చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com