ఏపీలోని మూడు జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్

కరోనా మహమ్మారి ఏపీని హడలెత్తిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. అటు కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కేసులు ఉద్ధృతి పెరుగుతోంది.
ఆదివారం నుంచి వారం పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జూన్ 2న మొదటి కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ గ్రామంలో 29 మందికి వైరస్ సోకింది. వీరిలో 16 మంది ఒకే కాలనీకి చెందినవారు. ధర్మవరంలో ఓ ప్రజాప్రతినిధి అంగరక్షకుడు ఇటీవల కరోనాతో మృతి చెందారు. అతని ద్వారా ఆరుగురికి వైరస్ సోకింది. జిల్లాకు చెందిన మరో ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబంలోనూ వైరస్ కలకలం సృష్టించింది. ఆయన బంధువొకరు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆ కుటుంబంలో ఐదుగురు వైరస్ బారినపడ్డారు. ధర్మవరంలో 34 కేసులు వచ్చాయి. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కియా, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే పది మంది కార్మికుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది..అందుకే జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఈ నెల 1 వరకు కేవలం 88 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. కానీ ఆ తర్వాత భారీగా పెరిగిపోయాయి. రోజుకి 30పైనే కేసులు నమోదు కావడంతో జిల్లాలో కేసుల సంఖ్య 3 వందలకు చేరువైంది. ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు వచ్చాయి. చీరాల పరిసరాల్లో 47 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ఉద్ధృతం అవడంతో ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం ఈ నెల 11న జరిగింది. అక్కడ 200 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన బంధువుకు ఆ తర్వాత వైరస్ సోకినట్లు తేలింది. ఇదే కార్యక్రమానికి హాజరైన ఓ వ్యాపారికీ కరోనా వచ్చింది. దీంతో పలాస, కాశీబుగ్గలను తొలుత కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. అంతకుముందే మందసలో ఓ వ్యక్తి వైరస్ సోకి మరణించడం, సంస్మరణ కార్యక్రమానికి ఎక్కువమంది హాజరైనందున పలాస నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

