చిరంజీవి గారూ.. మీరు ఎవరి వైపు..?

చిరంజీవి గారూ.. మీరు ఎవరి వైపు..?

చిరంజీవి గారూ.. మీరు ఎవరి వైపు..? ఈ ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలోని అన్ని క్రాఫ్ట్స్ నుంచీ వినిపిస్తోంది. కరోనా టైమ్ లో చారిటీ పెట్టి కార్మికులను ఆదుకున్నా.. అంతకు మించి రాబోతోన్న సమస్యల విషయంలో ఆయన నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. దాసరి స్థానాన్ని భర్తీ చేస్తాడు మన అందరివాడు అవుతాడు అనుకుంటే.. ఆయన కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. సమస్యలు చెప్పుకుందామంటే.. సారు కలవడానికే సమయం పడుతోంది.. అంటూ వాపోతున్నారు.. నిజంగా చిరంజీవి గారు దాసరి స్థానంలోకి వస్తారా..? పరిశ్రమకు అండగా నిలబడతాడా..? అనే ప్రశ్నల కంటే ముందు అసలు ఆయన ఎవరి వైపు ఉన్నారన్నదే పెద్ద ప్రశ్న అంటున్నారు సినీ జనం.

చిరంజీవి.. అనే చిరుజీవి.. తన స్వయంకృషితో సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆయన చేసిన కృషి, నటుడుగా నిలబడేందుకు చూపిన పట్టుదల.. ఆయన్ని మెగాస్టార్ గా మార్చాయి. నటుడుగా చిరంజీవి ఎందరికో రోల్ మోడల్. ఆ మోడల్ ను అనుసరించి ఎందరో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన ఫ్యామిలీ

నుంచి కూడా మరెందరో కుర్రాళ్లు హీరోలయ్యారు. మూడు దశాబ్ధాలకు పైగా కెరీర్ లో నేటికీ మెగాస్టార్ అంటే తను మాత్రమే అనిపించేంతటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో చిరంజీవి లాంటి నటుడ్ని డ్యాన్సర్ ను వెండితెర చూస్తుంది అనుకోలేం. అంతటి ఖ్యాతి గాంచిన మెగాస్టార్ ఇప్పుడు మరొకరిని తన రోల్ మోడల్ గా

తీసుకున్నారు. ఆయనే దర్శకరత్నదాసరి నారాయణరావు.

దాసరి నారాయణరావు అంటే సినిమా శక్తి. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. అందరికీ అండగా నిలిచాడు. చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నీషియన్స్ లో కొందరు, నటులు.. ఇలా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. 24 క్రాఫ్ట్స్ లోని అన్ని సంఘాల నాయకులతో స్వయంగా మాట్లాడి ఆ సమస్యలను తక్షణం పరిష్కరించిన సత్తా దాసరిది.

అందుకే ఆయన దర్శకుడుగా సినిమాలు తగ్గించుకున్నా.. ఇండస్ట్రీ పెద్దగా చివరి శ్వాసవరకూ చిత్తశుద్ధితో పనిచేసి పరిశ్రమకే మేస్త్రీ అయ్యారు. ఆ మేస్త్రీ అకాల మరణం పాలయ్యాక.. ఆస్థానం నిస్తేజంగా మారింది. దీంతో కొంత టైమ్ తీసుకున్నా.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తానంటూ వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. మరి చిరంజీవిలో దాసరి స్థాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు కారణం ఆయన వెంట ఉన్న వ్యక్తులు.. ఆయన చేస్తోన్న పనుల్లో భాగస్వామ్యం అవుతోన్న వ్యక్తులు.. నటుడుగా చిరంజీవికి తిరుగులేదు.. నాయకుడుగానే అనుమానాలు.

ఒకప్పుడు దాసరి ఇంటి తలుపు తట్టడం ఏ చిన్న ఎగ్జిబిటర్ కు అయినా అత్యంత సులువు. ఎందుకంటే ఆ తలుపులు బడుగుల కోసం, నిజంగా బాధపడుతోన్న వారి కోసం ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ స్థానాన్ని పొందాలని చూస్తోన్న చిరంజీవి ఇంటికి అంత సులువుగా ఎవరైనా వెళ్లగలరా..? 24 క్రాఫ్ట్ ల్లో ఏ క్రాఫ్ట్ వారైనా.. సమస్య జరిగిన వెంటనే చిరంజీవి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉందా..? అంటే అస్సలు లేదనే చెప్పాలి.

నిజానికి చిరంజీవి సినిమాల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నది కేవలం బాధితుల కోసం పోరాటం చేసి.. కానీ వాస్తవంలో ఆయన వెంట ఉంటున్నది.. ఆయన వెంటేసుకుని తిరుగున్నది ‘ఆ నలుగురిని’.. ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలకు కారణం ఆ నలుగురే అనేది అందరికీ తెలిసిన విషయం. వారు చెప్పిందే వేదంగా మారింది ఇప్పుడు. కానీ దాసరి ఉన్నప్పుడు వారి మాటలు చెల్లలేదు. దాసరి ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడ్డాడు. అందుకే నాయకుడయ్యాడు. మేస్త్రీ అనిపించుకున్నాడు. మరి చిరంజీవి.. ఇప్పుడు బాధితుల పక్షాన ఉన్నాడా అంటే లేడనే చెప్పాలి. కేవలం నాలుగు నుంచి ఐదు శాతం ఉన్న పరిశ్రమ మనుషుల్ని వెంటేసుకుని తిరుగుతూ.. లేదంటే వారి వెంట తిరుగుతూ ఉండే చిరంజీవి.. మిగతా 90-95 శాతం పరిశ్రమకు నాయకుడు అవుతాడా.. ? అవగలడా ..? అంటే అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా తమ ‘యూనియన్’సమస్య చెప్పుకునేందుకు చిరంజీవిని కలవాలంటే ఎన్నో అడ్డంకులు ఫేస్ చేయాలి. అనేకమందిని ఒప్పించాలి. దాసరి ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. నేరుగా ఆయన ఇంటికే వెళ్లే స్వేచ్ఛ ఉంది. అది ఇవ్వలేని చిరంజీవి నాయకుడు ఎలా అవుతాడు. పైగా ‘ఆ నలుగురిని’వెంటేసుకుని తిరిగే అతను.. 24 క్రాఫ్ట్స్ లోని మనుషుల సమస్యలను ఎలా గుర్తిస్తాడు.. అసలు వారి సమస్యలేంటో ఆయనకు తెలుసా..? ఏవో ఒకటీ రెండు చిన్న సినిమాల ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కు అటెండ్ అయితే దాసరి స్థానంలోకి వచ్చేస్తాడా.. అనేది ఇండస్ట్రీలోని పలువురి భావన.

మరోవైపు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం అంటూ చేసిన, చేస్తోన్న అన్ని అంశాలూ విమర్శలకే తావిచ్చాయి. ప్రధానంగా బాలకృష్ణ వ్యవహారం అనేక విమర్శలకు కారణమైంది. అలాగే మొదట్లో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇండస్ట్రీలో తమతో పాటు మరికొందరు ముఖ్యులను కూడా తీసుకువెళ్లారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కేవలం ‘సెలెక్టెడ్’గా వెళ్లడం అనుమానాలు తావిస్తోంది.

వీటన్నిటికీ మించి తాజాగా రాజమౌళి వ్యవహారం పరిశ్రమకే పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటి వరకూ ఉన్న దర్శకుల సంఘాన్ని కాదని, అసోసియేషన్ కు వ్యతిరేకంగా తనే సొంతంగా గ్రూపులు మొదలుపెట్టాడు రాజమౌళి. ఇది పరిశ్రమకే చేటు తెచ్చే వ్యవహారం. అందుకు కారణమైన రాజమౌళిని ప్రశ్నించకపోగా అతన్నే వెంటేసుకు తిరగడం కూడా

చిరంజీవి నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తోంది. రాజమౌళి విషయంలో మందలించకపోవడానికి కారణం ప్రస్తుతం అతను తన కొడుకుతో సినిమా చేస్తున్నాడనా లేక ఈయన ఇన్ డైరెక్ట్ గా రాజమౌళి మొదలుపెట్టిన కొత్త గ్రూప్ కు మద్ధతు ఇస్తున్నాడనా అనే అనుమానాలూ తలెత్తితే ఆశ్చర్యమేం లేదు.

నిజానికి ఇవన్నీ మేం చెబుతోన్న విషయాలు కాదు. దాసరి తర్వాత తమకు అండగా ఉంటాడనుకున్న చిరంజీవి పోకడ చూసిన 24 క్రాఫ్టుల్లోని చాలామంది ఆవేదనకు రూపం. వారంతా చిరంజీవిని ఆపద్బాంధవుడిలా భావించారు. అందరివాడు అవుతాడు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం కొందరి వాడయ్యాడు. అయినవారికి మాత్రమే బంధువుగా మారిపోతుండటం చూసి ఎంతోమంది యూనియన్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు.

అందుకే ఇదే విషయాన్ని నేరుగా చిరంజీవిగారినే అడుగుదాం.. ‘‘ చిరంజీవి గారూ మీ దారి ఎటు..? 90 శాతం ఉన్న సినిమా జనం వైపా.. 10శాతం ఉన్న ‘ఆ నలుగురివైపా’.. మొదటిది ఎంచుకుంటే మీరు కనీసం సినిమా పరిశ్రమకైనా మంచి నాయకుడు అవుతారు. రెండోది ఎంచుకుంటే .. మీపై ఆశలు పెట్టుకున్నవాళ్లు ‘మరోసారి’ మోసపోతారు.. అదే టైమ్ లో మీరు పరిశ్రమ బాగు కోరే వ్యక్తి కాదేమో అనే అనుమానాలకూ కారణమవుతారు.. అందుకే చిరంజీవి గారూ మీరు దాసరి స్థానం భర్తీ చేయాలనుకుంటే.. ఇండస్ట్రీ కోసం నిలబడండి. లేదా మీకు సొంత ఎజెండాలుంటే.. మీరు కోరుకున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం నిలబడండి’’ అంటూ పరిశ్రమలోని అన్ని క్రాఫ్టుల జనం ఫీలవుతున్నారు.. ఇక తేల్చుకోవాల్సింది చిరంజీవే.

Tags

Next Story