ఓ ప్రముఖ దర్శకుడు ఇంత నీచానికి దిగజారుతాడనుకోలేదు: అమృత

ఓ ప్రముఖ దర్శకుడు ఇంత నీచానికి దిగజారుతాడనుకోలేదు: అమృత

ప్రేమించిన వ్యక్తినిపెళ్లి చేసుకోవడమే కూతురు చేసిన నేరమని భావించి నా తండ్రి అత్యంత కిరాతకంగా నా భర్తను చంపించాడు. తరువాతి పరిణామాల అనంతరం నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డ అన్యాయమైపోతాడని భావించి వాడిని చూసుకుంటూ జీవచ్చవంలా బ్రతుకుతున్నాను. ఇప్పడు నా కథతో సినిమా తీయాలని సంకల్పిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నాకు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టేలా ఉన్నాడు అని వాపోతోంది మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత.

ఫాదర్శ్ డే సందర్భంగా తాను తీయ బోయే మర్డర్ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వర్మ. ప్రణయ్ అమృతల ప్రణయ కావ్యం నేపథ్యంలో తెరకెక్కనున్నదని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. దీనిపై స్పందించిన అమృత.. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలక్రిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ ని, కన్న తండ్రిని పోగొట్టుకున్నాను.. సమాజం నుంచి ఎన్నో చీత్కారాలను ఎదుర్కున్నాను. ఎవరికి వారు నా గురించి మాట్లాడుకుంటున్నారు.

నా సన్నిహితులకు తప్ప నాగురించి ఎవరికీ తెలియదు. పరువు పోతుందన్న ఆలోచనతో కూతురు ప్రేమను అర్థం చేసుకోలేని నా కన్న తండ్రి కిరాయి గూండాలను పెట్టి గర్భంతో ఉన్నానని కూడా చూడకుండా నా భర్తను నా కళ్ల ముందే పరమ కిరాతకంగా చంపించాడు. ఆ మనో వేదనతో ఆయనా ఆత్మహత్య చేసుకున్నారు. బిడ్డను చూసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు వర్మ రూపంలో మరో కొత్త టార్చర్ ఎదురవనుంది. దీన్ని ఎదుర్కునే శక్తి నాకు లేదు.

ఏడుద్దామన్నా కన్నీళ్లు కూడా రావట్లేదు. హృదయం బండ బారి పోయింది. కన్నీళ్లింకి పోయాయి. నా కథను మర్చిపోయుంటుంది సమాజం అనుకుంటున్న తరుణంలో మళ్లీ వర్మ మర్డర్ పేరుతో చిత్రాన్న తెరపైకి తీసుకువస్తున్నాడు. పేరు కోసం ఓ ప్రముఖ దర్శకుడు ఓ ఆడపిల్ల జీవితాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంత నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీ పై ఎలాంటి కేసు వేయను. ఈ స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివని సర్ధుకుపోతాను. ఎన్నో బాధలు అనుభవించా.. ఈ బాధేమంత పెద్దది కాదు అని బరువెక్కిన గుండెతో అమృత పలికింది.

Tags

Read MoreRead Less
Next Story