రాజధాని తరలింపు విషయంలో మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజధాని తరలింపు విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రక్రియ అమలు ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ గురించి ప్రస్తావించారని.. అయితే ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో తరలింపు ప్రక్రియ కుదరదని పెద్దిరెడ్డి తెలిపారు. మరికొంతకాలం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాజధాని తరలింపు ప్రక్రియ తాత్కాలిక నిలిపివేతకు కరోనాను మంత్రి పెద్ది రెడ్డి కారణంగా చూపినప్పటికీ... దీనిపై ఎదురవుతున్న న్యాయపరమైన, చట్టపరమైన ఇబ్బందులే ప్రభుత్వం వెనకడుగుకు కారణంగా తెలుస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం జరిగింది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును మళ్లీ ఎలా ప్రవేశపెడతారని విపక్షాలు ప్రశ్నించాయి. అయితే రాజధాని బిల్లు కోసం అధికారపక్షం పట్టుబట్టడంతో.. అత్యంత ముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండానే సభ వాయిదా పడింది. ఈ పరిణామం కూడా సర్కారును పునరాలోచనలో పడేసిందని సమాచారం. మరోవైపు.. మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అహ్వానించింది. 15 రోజుల క్రితం ప్రభుత్వం వాలంటీర్లతో ఓ సర్వే చేయిందని అందులో 69 శాతం మంది రాజధాని తరలింపును వ్యతిరేకించారని.. సమితి నాయకులు చెబుతున్నారు. దీనివల్లే సర్కారు వెనుకడుగు వేసిందని.. అయితే తాత్కాలికంగా కాకుండా.. శాశ్వతంగా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామంటూ ప్రకటన చేయాలని... ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.
ఇక అటు కేంద్రం నుంచి కూడా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి వచ్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనాతో ప్రస్తుతమున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. విశాఖలోని తూర్పు నౌకాదళం అత్యంత కీలకమని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సమయంలో నగరాన్ని రాజధానిగా మార్చడం అంత శ్రేయస్కరం కాదని కూడా కేంద్రం నచ్చజెప్పినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా జగన్ సర్కారు దిగివచ్చి.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే అమరావతిలో రాజధాని కొనసాగింపు కోసం.. రైతులు ఆరునెలలుగా ఉద్యమిస్తున్నారు. గడచిన ఏడాదిలో ఎన్నో ఉద్యమాలకు ఈ అంశం కారణమైంది. దీనికితోడు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మళ్లీ కేపిటల్ తేనెతుట్టెను కదపడం ఎందుకని సర్కారు భావించిందని.. అందుకే తరలింపు ప్రక్రియను పక్కనబెట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com