పేదలకు ఇళ్ల నిర్మాణంలో వైసీపీ సర్కారు ఘోర వైఫల్యం

పేదలకు ఇళ్ల నిర్మాణంలో వైసీపీ సర్కారు ఘోర వైఫల్యం
X

హామీలదేముంది. ఎన్నైనా ఇవ్వొచ్చు. ఏమైనా చెప్పొచ్చు. అవి నిలబెట్టుకుంటేనే కదా.. ఆ నాయకుల మాటలకు అసలైన విలువ. YCP సర్కారు అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు అస్సలు పొంతనే లేదు. ఎన్నికల టైమ్‌లో పేదలపై ఎక్కడలేని ప్రేమ ఒలకపోసిన YCP.. తీరా ఈ ఏడాదిగా వాళ్లకు ఒక్క ఇల్లైనా కట్టించి ఇచ్చిందా అంటే ఆ పార్టీ వాళ్ల దగ్గరే సమాధానం లేదు. సెంటు, సెంటున్నర ఇళ్లపట్టాల పేరుతో హడావుడి చేస్తున్నా అందులోనూ అంతులేని అవినీతి. ఏడాదిగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలైతే .. CM జగన్ తీరుపై రగిలిపోతున్నారు. చంద్రబాబు పాలనలో కట్టేసి సిద్ధంగా ఉన్న వేలాది ఇళ్లు ఇప్పటికీ లబ్దిదారులకు అందలేదు. అలాగే కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే 6 లక్షల ఇళ్లు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇది కక్ష సాధింపు రాజకీయం కాక మరేంటి అని ప్రశ్నిస్తున్నారు లబ్దిదారులు. పార్టీలకు అతీతంగా పథకాలు అందించాల్సిన ప్రభుత్వమే.. చంద్రబాబు కట్టించారనే కారణంగా ఇళ్లను పూర్తి చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఇళ్లు లేని పేదలు దాదాపు 30 లక్షల మంది వరకూ ఉన్నారని ప్రభుత్వం చెప్తోంది. దాంట్లో వారు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారమే చూసినా.. TDP ప్రభుత్వం 13 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఇందులో ఏడున్నర లక్షల ఇళ్లు పూర్తి చేసిందని వివరిస్తున్నారు. మిగతా ఇళ్లు పెడింగ్‌లోనే ఉన్నాయంటున్నారు. ఈ లెక్కన చూసుకున్నా ఈ ఏడాదిలో ఆ పెండింగ్‌ ఇళ్లన్నీ పూర్తి చేసి పేదలకు ఇవ్వొచ్చు. కానీ.. జగన్‌ ప్రభుత్వం అలా చేయలేదు. దీన్నే TDP తీవ్రంగా తప్పుపడుతోంది. 2022 నాటికి అందరికీ సొంతిల్లు లక్ష్యంతో తమ ప్రభుత్వం ఐదేళ్లలో 15 వేల కోట్లు ఖర్చు చేసి 15 లక్షల ఇళ్లు కట్టినట్టు చెప్తోంది. ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ కోసం చేసిన ఖర్చుతో ఆ పెండింగ్ ఇళ్లు పూర్తి చేస్తే 15 లక్షల మందికి సొంతింటి కల నిజమయ్యి ఉండేదంటున్నారు. వీటికి అదననంగా మరో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తే పేదలందరికీ పూర్తి న్యాయం జరిగేది అంటున్నారు. కానీ ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో స్కామ్‌కి తెర లేపారని మండిపడుతున్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల కోసం భూమి కొనుగోలు, చదును చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికి 4 వేల 300 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో దాదాపు 2 వేల కోట్ల అవినీతి జరిగిందనేది TDP వాదన. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సమీపంలోని బూరుగుపూడిలో ఆవ భూముల కొనుగోళ్లలో 250 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో YCP శాసనసభ్యుని దగ్గర నుంచి 100 ఎకరాల భూమిని పేదల పట్టాల కోసం తీసుకున్నారు. పక్కనే 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా..ఈ ప్రైవేట్ భూమి కొనడానికి కారణం ఏంటో చెప్పాలని TDP ప్రశ్నిస్తోంది. ఇదొకటే కాదు.. వివిధ జిల్లాల్లో భూసేకరణ సందర్భంగా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చంద్రబాబు అంటున్నారు.

నిజానికి TDP హయాంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఈ క్వాలిటీపై లబ్దిదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది కిందట ఎలక్షన్ల కారణంగా వేల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. చిన్న చిన్న వర్క్‌లు పూర్తి చేస్తే అవి కూడా లబ్దిదారులకు ఇవ్వొచ్చు. అలాగే కట్టేసి సిద్ధంగా ఉన్న ఇళ్లు కూడా వేల కొద్దీ ఉన్నాయి. ఒక్క అమరావతిలోనే చూసుకుంటే అక్కడ 5 వేల 74 ఇళ్లు కట్టేసి ఏడాదిగా అలాగే ఉండిపోయాయి. YCP ప్రభుత్వం వాటిని ఇంకా లబ్దిదారులకు అందించలేదు. అలాగే విశాఖ జిల్లాలో చూసుకుంటే మొత్తం 28 వేల ఇళ్లు వివిధ దశల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత YCP ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో ప్రతి చోటా ప్రాజెక్టులు ఆపేసి.. వాటిని పెండింగ్ పెట్టడంతో పేదల సొంతింటి కల కాస్తా కలగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. విజయవాడ సమీపంలోని జక్కంపూడి షాబాద్‌లో టీడీపీ హయాంలో ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద 28 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఇప్పటికే వీటిల్లో 7 వేల ఇళ్లు పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం 15 వేల మంది లబ్దిదారులు డిపాజిట్లు కూడా కట్టారు. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వారంతా డిపాజిట్లు కట్టారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేటలో JNNURM కింద కడుతున్న 3 వేల ఇళ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇలా ఎక్కడికక్కడ ఇళ్లు సిద్ధమై కొన్ని, చిన్న చిన్న పనులతో మరికొన్ని పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం వాటిని పూర్తి చేయడం లేదు. లబ్దిదారులకు అందించడం లేదు. దీన్నే TDP ప్రధానంగా ప్రస్తావిస్తోంది. పేదలపై YCP సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.

Tags

Next Story