సంతోష్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

సంతోష్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

గాల్వన్ లోయలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు ప్రాణత్యాగానికి వెలకట్టలేమన్నారు సీఎం కేసీఆర్‌. కల్నల్‌ చేసిన త్యాగాన్ని గౌరవిస్తూ..సీఎం కేసీఆరే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎర్రవెల్లి ఫామ్‌ హౌజ్‌ నుంచి రోడ్డు మార్గంలో సూర్యపేటకు చేరుకున్న సీఎం మొదటగా కల్నల్ సంతోష్‌ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఆ తర్వాత కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబాన్ని పరామర్శించారు సీఎం కేసీఆర్‌. వీరయోధుడ్ని కన్న తల్లిదండ్రులకు, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎప్పటికీ అండగా నిలబడుతుందని భోరోసా ఇచ్చారు సీఎం. కల్నల్ భార్య సంతోషితో పాటు ఆయన తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు. సంతోష్‌ బాబు కుమారుడు, కూతురిని పలుకరించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించినట్టుగానే 5 కోట్ల చెక్‌ ను సంతోషికి అప్పగించారు. సంతోష్‌బాబు భార్యకు 4 కోట్ల రూపాయల చెక్‌, ఆయన తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను సీఎం స్వయంగా అందజేశారు అలాగే హైదరాబాద్ షేక్‌ పేటలో 700 గజాల ఇంటిస్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను అందించారు. ఇక గ్రూప్‌ -1 జాబ్‌ అపాయింట్మెంట్‌ లెటర్‌ అందించారు.

దేశసేవలో ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు తగిన గుర్తింపు దక్కేలా చర్యలు చేపడతామన్నారు సీఎం కేసీఆర్‌. సూర్యపేట చౌరస్తాలో కల్నల్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. సంతోష్‌ మృతి తనను కలిచివేసిందన్నారు. కల్నల్‌ కుటుంబానికి ఏళ్లవేళలా అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్‌ తమకు కొండంత భరోసా ఇచ్చారని అన్నారు కల్నల్ సంతోష్‌ బాబు భార్య సంతోషి. ఎప్పుడు ఏ సాయం కావాలన్న చేస్తామని సీఎం చెప్పారని అన్నారు. అంతేకాదు..ఉద్యోగం ఏ శాఖలో కావాలంటే ఆ శాఖలో ఇస్తామని కేసీఆర్‌ చెప్పినట్లు సంతోష్ బాబు కుటుంబసభ్యులు చెప్పారు.

కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. కల్నల్‌ ఇంట్లోకి నలుగురిని మాత్రమే అనుమతించారు. కల్నల్‌ ఉండే ప్రాంతం విద్యానగర్‌ కాలనీ మొత్తాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. కేసీఆర్‌ పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావొద్దని ముందే స్థానికులకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story