చైనాతో 'మహా' కటీఫ్.. రూ.5వేల కోట్ల డీల్ క్యాన్సిల్..

చైనాతో మహా కటీఫ్.. రూ.5వేల కోట్ల డీల్ క్యాన్సిల్..
X

గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను కలచి వేసింది. ఆ ఘటనతో మరో సారి తెరపైకి వచ్చింది చైనా వస్తువులను బ్యాన్ చేయడం.. చైనాతో జరుపుతున్న వాణిజ్య ఒప్పందాలను నిలిపి వేయడం.. ఎగుమతులు, దిగుమతులను రద్దు వంటివి. ఈ నేపథ్యంలో మహారాష్ట సర్కారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే చైనాతో కుదుర్చుకున్న రూ.5 వేల కోట్ల విలువ చేసే ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో భాగంగా రాష్ట్ర సర్కారు చైనా సంస్థలతో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి వుంటామని ఆయన అన్నారు. ఈ రూ.5 వేల కోట్ల డీల్ లో.. ఆటో మొబైల్ ప్లాంటు ఏర్పాటుకు గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ రూ.3,770 కోట్లు, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ రూ.1000 కోట్లు, హెంగ్లీ ఇంజనీరింగ్ సంస్థ రూ.250 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Tags

Next Story