ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాస్క్ ధరించకపోతే ఎలా? : మాజీ ఎంపీ ఉండవల్లి

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై నిలదీశారు. అధిక ధరలకు భూములు కొని, ఇళ్ల పట్టాలు ఇస్తామనడం జగన్ సర్కారు అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. ఆవ భూములపై లేఖ రాసినా స్పందన లేదన్నారు. 15 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లే ఇంకా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. .రాజమండ్రికి దూరంగా స్థలాలు ఇవ్వడం వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు ఉండవల్లి..
జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం గందగోళంగా ఉందన్నారు ఉండవల్లి. ఇప్పటికీ ఇసుక దొరకడం లేదని చెప్పారు. ముందుచూపు లేకుండా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయిందని ఆరోపించారు.
మద్య నియంత్రణ విషయంలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు ఉండవల్లి. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అక్రమ మద్యం వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు...ధరలు విపరీతంగా పెంచడం వల్ల రాష్ట్రంలో నాటు సారా వినియోగం పెరిగిందని అన్నారు..దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.. సీఎం జగన్ మాస్క్ వేసుకోకపోవడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాస్క్ ధరించకపోతే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com