సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించినా పంతానికి పోతున్న ప్రభుత్వం

ఏపీ SEC వివాదం మలుపులమీద మలుపులు తిరుగుతోంది. హైకోర్టు చెప్పినా...సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించినా పంతానికి పోతున్న ప్రభుత్వం నిమ్మగడ్డను తిరిగి SECగా నియమించడం లేదు. దీంతో మళ్లీ హైకోర్టు తలుపుతట్టారు నిమ్మగడ్డ. ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును.. ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంలో తాను చేసిన విజ్ఞప్తులను సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎస్, పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శిని.. ప్రతివాదులుగా చేర్చారు. నిమ్మగడ్డ వేసిన ఈ ధిక్కార పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది...
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఆయన స్థానంలో కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్‌ను నియమించారు.. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు నిమ్మగడ్డ. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టివేసింది న్యాయస్థానం. ముఖ్యమంత్రి ఇష్టం మేరకు కొత్త ఎస్‌ఈసీని నియమించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రమేశ్‌కుమార్ ఐదేళ్ల కాలపరిమితితో ఎస్‌ఈసీగా నియమితులయ్యారని.. ఆయన పదవీకాల హక్కును ప్రభుత్వం నిరాకరించడానికి వీల్లేదని చెప్పింది. రాజ్యాంగ పదవిలో ఉన్న రమేశ్ కుమార్‌ను పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. SEC నియామకం విషయంలో ముందుగా అర్హతలు నిర్ణయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తీర్పు చెప్పింది హైకోర్టు.
అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టింది ప్రభుత్వం. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఇందుకు సుప్రీం ధర్మాసనం ఒప్పుకోలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలకు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అటు SEC పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఆ ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు నమ్మదగ్గవిగా లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేశాక.. 2 వారాల తర్వాత పూర్తిస్థాయిలో వాదనలు వింటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకాన్ని సవాల్ చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంటే.. న్యాయస్థానాల ఆదేశాలను బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ SECగా కొనసాగవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం ఆయన్ను తిరిగి ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధంగా లేదు. కోర్టు తీర్పుల తర్వాత కూడా మీనమేషాలు లెక్కిస్తోంది. సుప్రీంలో వేసిన పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రభుత్వంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ. మరీ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com