భగ్గుమంటున్న చమురు ధరలు.. వినియోగదారుల జేబులకు చిల్లులు..

భగ్గుమంటున్న చమురు ధరలు.. వినియోగదారుల జేబులకు చిల్లులు..
X

చమురు ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వరుసగా 18వ రోజూ చమురు ధరలు పెరిగాయి. ఐతే, ఈసారి పెట్రోల్ వినియోగదారులపై చమురుకంపెనీ లు కాస్త దయతలిచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరను మాత్రమే పెంచారు. లీటర్ డీజిల్‌పై 48 పైసలు పెంచగా, పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో మొదటిసారిగా పెట్రోలు రేట్ కంటే డీజిల్ ధర ఎక్కువగా నమోదైంది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 79 రూపాయల 88 పైసలకు చేరగా పెట్రోల్ ధర 79 రూపాయల 76 పైసలుగా ఉంది. మోదీ ప్రభుత్వం రాక ముందు 2014 మే 13 నాటికి దేశంలో లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయల 51 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 57 రూపాయల 28 పైసలుగా ఉంది. అప్పట్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లకు మధ్య 14 రూపాయల తేడా ఉండేది. అప్పుడే కాదు, గతంలోనూ పెట్రోల్ రేట్ కంటే డీజిల్ ధరే తక్కువగా ఉండేది. కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది. డీజీల్ ధర పెట్రోల్‌ ధరతో సమానమయ్యింది. ఇప్పుడేమే ఏకంగా పెట్రోల్ రేట్ కంటే డీజిల్ రేటే ఎక్కువగా ఉంది.

మోదీ సర్కారు హయాంలో చమురు ధరలు చాలాసార్లు పెరిగాయి. కొన్ని సందర్భాల్లోనే రేట్లను తగ్గించారు. రెండేళ్ల క్రితమైతే లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు దాటేసింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గిన చమురు ధరలు కరోనా సంక్షోభ కాలంలో పెద్దగా పెరగలేదు. దాదాపు 82 రోజుల పాటు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోవడం, దేశీయంగా వినియోగం పెద్దగా లేకపోవడంతో చమురు కంపెనీలు కూడా రేట్లను మార్చలేదు. కానీ, లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించిన తర్వాత ఒక్కసారిగా జూలు విదిల్చారు. రోజు రోజుకు రేట్లు పెంచుతూ వినియోగదారుల పై విపరీతమైన భారం మోపారు. గత 18 రోజుల్లో పెట్రోల్ ధర 8 రూపాయల 50 పైసలు, డీజిల్ ధర 10 రూపాయల 48 పైసల చొప్పున పెరిగాయి.

చమురు ధరలు ఇంతలా పెరగడానికి పన్నులే కారణం. 2014లో డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 3 రూపాయల 56 పైసలు, పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయల 48 పైసలుగా ఉంది. గత ఆరేళ్లలో ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్‌పై 32 రూపాయలు పెరిగితే, డీజిల్‌పై 31 రూపాయల 83 పైసలు పెరిగింది. మొత్తంగా డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 35 రూపాయలు, పెట్రోల్‌పై 41 రూపాయలకు చేరింది. ఈ ఏడాది మార్చ్ 14న పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌కు 3 రూపాయలు విధించారు. మే 5న పెట్రోల్‌పై 10, డీజిల్‌పై 13 రూపాయలు పెంచారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా 2 లక్షల కోట్లు వచ్చాయి.

Tags

Next Story