ఆ 4 నెలల్లో 60 మంది కార్మికుల ఆత్మహత్య : నారా లోకేశ్

ఆ 4 నెలల్లో 60 మంది కార్మికుల ఆత్మహత్య : నారా లోకేశ్
X

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి వచ్చి రాగానే..ఇసుక నూతన పాలసీ అంటూ 4 నెలలు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఆ 4 నెలల్లోనే దాదాపు 60 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా చేసి కొత్త పాలసీ అంటూ ఇసుక ధరలను అమాంతంగా పెంచారని..దాంతో భవన నిర్మాణం రంగంపై ఆధారపడిన కార్మికులతో పాటు...సిమెంట్, ఐరన్, ఎలక్ట్రికల్, ఇటుక బట్టీలు, కంకర క్వారీ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని లోకేష్ అన్నారు.

కొత్త పాలసీ అధికార పార్టీలోని ఇసుక మాఫియా నేతలు కోట్లకు పడగలెత్తారని అన్నారు. ఆన్ లైన్ లో ఇసుక విధానం అంటూ గొప్పగా ప్రకటనలు చేసినా.. బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైతే కేవలం ఐదు నిమిషాల్లో స్టాక్ అయిపోతుందన్నారు. ఆ తర్వాత వ్యవహారమంతా బ్లాక్ మార్కెట్ దందా అని ఆరోపించారు. ఆన్ లైన్ లో ఇసుక లేదంటూ చూపిస్తారు..కానీ, చెప్పిన రేటు ఇస్తే ఎన్ని లారీల ఇసుకనైనా పంపిస్తామంటూ ఇసుక మాఫియా అక్రమంగా అమ్ముకుంటున్న విషయం మీకు తెలుసు అంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు. అంతెందుకు ఇసుక విధానంలో ఎంత అవినీతి ఉందో స్వయంగా అధికార పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారని ఆయన అన్నారు. ఓ మంత్రి ఇంటికే ఇసుక బుదులు మట్టి పంపించిన ఘనత మీ హాయాంలోనే జరిగిందంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు లోకేష్. ఇసుక రీచ్ ల నుంచి యార్డులకు వెళ్లే మధ్యలోనే లారీలు మాయం అవుతున్నాయంటూ స్వయంగా వైసీపీ నేతలే చెబుతున్నారని..దాన్నిబట్టి ఇసుక విధానంలో డొల్లతనం తెలిసిపోతుందని విమర్శించారు. ఇసుక రీచ్ ల కోసం అధికార పార్టీల నేతల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ విభేదాలకు కూడా కారణం అవుతోందన్నారు. రాజధాని ప్రాంతంతో పాటు, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల ఇసుక తగాదాలను సీఎం స్వయంగా పరిష్కరించారంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుందని విరుచుకుపడ్డారు.

ఇసుక మాఫియాలో తగాదాలను కూడా పరిష్కరిస్తూ నేతల మధ్య సఖ్యత కుదురుస్తున్న అధికార పార్టీ అధనేత..భవన నిర్మాణ కార్మికులను మాత్రం పట్టించుకోవటం లేదని లోకేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన కార్మిక సంక్షేమ మండలి బోర్డు ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు లోకేష్. గతంలో కార్మికుల కుటుంబాల్లో వివాహ కానుకగా 20 వేలు, ప్రసూతి కానుకగా 20 వేలు, ప్రమాదం జరిగితే జీవనోపాధి నిమిత్తం 9 వేలు ఇచ్చేవి. 5 లక్షల జీవిత భీమా కల్పించాయి. కానీ, ఇప్పటి ప్రభుత్వం హయాంలో అసలు కార్మిక సంక్షేమ బోర్డుకు పాలక మండలి కూడా లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవటమే తప్ప..ఒక్క రూపాయి కూడా కార్మికులకు అందలేదన్నారు లోకేష్. కనీసం భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వటం లేదన్నారు.

Tags

Next Story