బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 83 మంది మృతి

బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 83 మంది మృతి
X

బిహార్‌లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఏకంగా 83 మంది ప్రాణాలు బలిగొన్నాయి. నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో... దాదాపు అన్ని జిల్లాల్లో పిడుగుల బీభత్సం కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు మృతుల సంఖ్య పెరుగూతూనే పోయింది. బిహార్‌లో పిడుగుల వల్ల 83 మంది చనిపోయారని... రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే... గోపాల్‌గంజ్‌లో అత్యధికంగా 13 మంది పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు. ఎక్కువ మంది పొలాల్లో పనిచేస్తుండగా ఈ ప్రమాదాలకు గురయ్యారు.

మరోవైపు వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనేఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బయటకు వెళ్లినవారు చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ కూడా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి ముందు కురుస్తున్న వర్షాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. బిహార్‌లో పిడుగుల ధాటికి సంభవించిన మరణాలపై సీఎం నితీష్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 4 లక్షల రూపాలయ చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు.. యూపీలోనూ పిడుగులు జనం ఉసురు తీశాయి. దాదాపు 25 మందికిపైగా పిడుగుల వల్ల మృత్యువాతపడ్డారు.

Tags

Next Story