కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై చంద్రబాబు లేఖ

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో తీవ్ర తాగునీటి, సాగునీటి ఎద్దడి ఉందని, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 90 శాతం కుప్పం బ్రాంచ్ కెనాలు పనులు పూర్తయ్యాయయన్నారు. కేవలం 50 కోట్ల విలువైన పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలిన పది శాతం పనులు గత 13 నెలలుగా పెండింగ్‌లో ఉండటం బాధాకరమని లేఖలో ప్రస్తావించారు.
ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు తాగునీటి వెతలు, ఇంకో వైపు సాగునీటి కొరత స్థానికుల సహనానికి పరీక్షగా మారాయని లేఖలో తెలిపారు. నీరు ప్రగతి పనులు నిలిపివేయడం మరో అనాలోచిత చర్యగా అభివర్ణించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు నిలిపివేయడం కక్ష సాధింపేనన్నారు. కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి తెచ్చారన్నారు. సత్వరమే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులతో సహా అన్ని జిల్లాలో పెండింగ్ నీటి పారుదల ప్రాజెజక్టుల పనులు పూర్తి చేయాలని లేఖలో తెలిపారు. రైతులను, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com