తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
X

సోమవారం 872.. మంగళవారం 879... బుధవారం.. 891.. గురువారం 920.. ఇవి తెలంగాణలో కరోనా లెక్కలు.. రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడంతో బాధితుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది.. గడిచిన 24 గంటల్లో 920 కరోనా కేసులు నమోదవడం వైరస్‌ తీవ్రత ఏస్థాయిలో ఉందో గుర్తు చేస్తోంది.. గడిచిన 24 గంటల్లో 3616 శాంపిల్స్‌ పరీక్షించగా 920 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 327 మందిని డిశ్చార్జ్‌ చేయగా.. కరోనా సోకి ఐదుగురు మరణించారు.

ఇక జీహెచ్‌ఎంసీలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. గ్రేటర్‌ పరిధిలో వారం రోజుల్లో 50 వేల పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ శాంపిల్స్‌ సేకరిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా పెగిరిపోతూనే ఉంది.. జీహెచ్‌ఎంసీలో గడిచిన 24 గంటల్లో 737 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌లో 60 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.. కరీంనగర్‌లో 13 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు, మహబూబ్‌నగర్‌లో మూడు, నల్గొండలో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి.. ఇప్పటి ఇప్పటి వరకు 4688 మంది డిశ్చార్జ్‌ కాగా, 6446 యాక్టివ్‌ కేసులున్నాయి.. ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 230కి చేరింది.

హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది.. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు.. పైగా లాక్‌ డౌన్‌ ఆంక్షలు సడలించడంతో జనం రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.. ఏమాత్రం జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది.. ప్రభుత్వ సూచనలను జనం పట్టించుకోకపోవడంతో వ్యాపారులే స్వచ్ఛందంగా షాపులు బంద్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కరోనా వ్యాప్తి ఈ నేపథ్యంలో వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు మార్కెట్లు లాక్‌ డౌన్‌ అయ్యాయి.. ఆదివారం నుంచి వచ్చే నెల ఐదు వరకు బేగంబజార్‌లోని దుకాణాలను బంద్‌ చేస్తున్నట్లు కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.. నేటి నుంచి వచ్చేనెల ఐదు వరకు సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు మూతపడనున్నాయి.. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరికొన్ని మార్కెట్లు మూసివేస్తున్నట్లు అసోసియేషన్లు తెలిపాయి.

తెలంగాణలో కరోనా టెస్టులకు అనుమానితులు పోటెత్తుతున్నారు.. ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్‌ నిర్ధారణ అవుతుండటం, పాజిటివ్‌గా రావడంతో జనంలో భయం పెరిగిపోతోంది.. దీనికి తోడు ప్రభుత్వం వారం రోజుల్లోనే 50 వేలకుపైగా పరీక్షలు చేస్తామని చెప్పడంతో అనుమానితులంతా పరీక్షల కోసం ఎగబడుతున్నారు.. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నాలుగు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శాంపిల్స్‌ తీసుకుంటున్నారు.. లక్షణాలు వున్న వారు లేని వారు అంతా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు.. వేలాదిగా శాంపిల్స్‌ ఉండిపోవడంతో పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.. ఫలితాలు వెల్లడించేందుకు మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.. ఐదు ల్యాబ్‌ల వద్ద కరోనా శాంపిల్స్‌ వేలాదిగా ఉండిపోయాయి.. అటు రిజల్ట్‌ ఏంటో తెలియక వైరస్‌ అనుమానితులు తీవ్ర ఆందోళనలో ఉండిపోయారు..

అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో రెండ్రోజులపాటు కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.. ఈనెల 16 నుంచి ఇప్పటి వరకు 36వేల శాంపిల్స్‌ సేకరించామన్నారు.. కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.. అలాగే ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు చేస్తున్నారు.. ఇప్పటి వరకు సేకరించిన శాంపిల్స్‌లో 8253 శాంపిల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి.. ఒక వ్యక్తి నుంచి కరోనా శాంపిల్‌ తీసుకుంటే దాన్ని 48 గంటల్లోగా పరీక్షించాలి.. అప్పటి వరకు దానిని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేసిన శాంపిల్స్‌ సేకరించడం వల్ల ల్యాబ్స్‌లో పెద్ద ఎత్తున శాంపిల్స్‌ పేరుకుపోయాయి.. వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో టెస్టులు నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక శాంపిల్స్‌ తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంచి పరీక్షలు జరిపితే ఫాల్స్‌ పాజిటివ్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న శాంపిల్స్‌ను పరీక్షించడం, ల్యాబ్స్‌, కలెక్షన్‌ సెంటర్లను శానిటైజ్‌ చేయడం కోసం రెండ్రోజులపాటు ప్రత్యేక శిబిరాల్లో కరోనా అనుమానితులకు పరీక్షలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Tags

Next Story