లాక్డౌన్ @ జూలై 5.. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ

కరోనా బయటకి వస్తే మనుషుల్ని బతకనిచ్చేటట్లు లేదని మరోసారి లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈసారి లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్ర విద్యార్థులకు ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. జూలై 5తో పరీక్షలు ముగియనున్నందున లాక్డౌన్ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయింత్రం ప్రత్యేక సమావేశం జరిగింది.
వైరస్ విస్తృతమవుతున్న దశలో వారాంతపు సెలవుల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలనుకుంటున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. దీంతో పాటు జూలై 5 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రతి రోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే కార్యాలయాలకు రావాల్సి ఉంటుందన్నారు. ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్ అని ప్రకటించారు.
క్యాబ్ లు, ట్యాక్సీలు, బస్సులు అన్నీ బంద్. అయితే జూలై 5 వరకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అలాగే ఉంటుందన్నారు. ప్రస్తుతం బెంగళూరులో పరిస్థితి.. ప్రజలు ఓ వైపు వర్షాలతో, మరోవైపు కరోనాతో సతమతమవుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 11,923 కాగా ఒక్క బెంగళూరులోనే 569 కేసులు నమోదవడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

