అంతర్జాతీయం

మరో కొత్త వైరస్.. ప్రతి పది మందిలో ఒకరికి ఇప్పటికే: చైనా పరిశోధకులు వెల్లడి

మరో కొత్త వైరస్.. ప్రతి పది మందిలో ఒకరికి ఇప్పటికే: చైనా పరిశోధకులు వెల్లడి
X

కరోనాతో ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎంత కాలం ఇలా ఉంటుందో ఎవరికీ అంతుబట్టని విషయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరో వైరస్ దాడి చేయబోతోంది అని చైనా చావు కబురు చల్లగా చెబుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో వారి పరిశోధనలను ప్రచురించారు.

మరో కొత్త వైరస్ జీ-4. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్ 1 ఎన్1 వైరస్ జాతి నుంచే ఈ కొత్త వైరస్ జీ-4 ఉద్భవించిందని పరిశోధకులు గుర్తించారు. మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

2011 నుంచి 2018 మధ్య చైనాలోని జంతువధ శాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30 వేల నమూనాలను సేకరించి పరిశోధనలు జరపగా దాదాపు 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్ లను కనుగొన్నారు. వీటితో పాటు ఫెర్రెట్ అనే ముంగిస జాతికి చెందిన జంతువుపై చేసిన ప్రయోగాల్లో జీ-4 వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా గుర్తించారు. అలాగే ఇది మానవ కణాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గమనించారు. పందులకు సంబంధించిన పరిశ్రమలో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ కొత్త వైరస్ ఇప్పటికే సోకిందని అధ్యయనంలో తేలింది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా లేదా అనే దానిపై పరిశోధనలు జరపవలసి ఉంది. అదే కనుక జరిగితే సమీప భవిష్యత్తులో మరో ముప్పు లేకపోలేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మానవుడు తన అవసరాలకు అనుగుణంగా జంతువులను పెంచి పోషిస్తున్నాడు. దాని కారణంగానే మనుషులకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని తాజా అధ్యయనం నిరూపిస్తోందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని పశువైద్య విభాగం అధిపతి జేమ్స్ ఉడ్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ పశుపోషణ వల్ల జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోందన్నారు.

Next Story

RELATED STORIES