కనిపించకుండా పోయిన 'అక్కచెల్లెళ్లు' నిత్యానంద స్వామి 'కైలాసం'లో..

కనిపించకుండా పోయిన అక్కచెల్లెళ్లు నిత్యానంద స్వామి కైలాసంలో..
X

మీ అమ్మాయిలకు మరేం పర్వాలేదు. మా కైలాసంలో 'చట్నీ మ్యూజిక్' అనే కళను అభ్యసిస్తూ ఆనందంగా ఉన్నారు అని స్వామీ నిత్యానంద ఆ తల్లిదండ్రులకు అభయమిస్తున్నారు. 2013లో కర్ణాటకకు చెందిన జనార్ధన శర్మ తన నలుగురు కూతుళ్లను నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో చేర్పించారు. తల్లిదండ్రులకు మాటమాత్రమైనా చెప్పకుండా, కనీసం సమాచారమైనా అందచేయకుండా ఆ నలుగురు అమ్మాయిలను 2019లో అహ్మదాబాద్ లో ఉన్న యోగిని సర్వజ్ఞాన పీఠానికి పంపించారు ఆశ్రమ నిర్వాహకులు.

ఆలస్యంగా విషయం తెలుసుకున్న శర్మ దంపతులు.. అహ్మదాబాద్ ఆశ్రమానికి వెళ్లగా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారి జోక్యంతో ఇద్దరు మైనర్ కూతుళ్లను శర్మకు అప్పగించారు. మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ (21), నందిత (18) అమ్మానాన్నలతో వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆశ్రమంలోని వారి బెదిరింపులకు లొంగిపోయే తమ బిడ్డలు అలా మాట్లాడుతున్నారని శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిత్యానంద వారిని విదేశాలకు తీసుకెళ్లినట్లు సమాచారం.

నిత్యానంద స్వాముల వారు ఈక్వెడార్ లో ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి 'కైలాస' అని పేరు పెట్టి అక్కడే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరు 'కైలాస' నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారని, భారత-కరేబియన్ సంస్కృతుల మేళవింపుతో కూడిన చట్నీ మ్యూజిక్ కళను అభ్యసిస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారని గుజరాత్ పోలీసులు శర్మ దంపతులకు సమాచారం అందించారు. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద 'కైలాస' పేరుతో తనదైన ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం.

Tags

Next Story