ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లో 'కొవాగ్జిన్' వ్యాక్సిన్..

కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రపంచాన్ని కొవిడ్ నుంచి విముక్తి చేయాలని దాదాపుగా 17 ప్రముఖ ఫార్మా సంస్థలు రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇవి సత్ఫలితాలిస్తే ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)భావిస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనగల్ బలరాం భార్గవ ఓ లేఖను విడుదల చేశారు.
వ్యాక్సిన్ తుది దశకు చేరుకోవడంలో క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని భార్గవ లేఖలో పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు కావలసిన అనుమతులు పొందాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై భారత్ బయోటెక్ స్పందించడానికి నిరాకరించింది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచంలో కొవిడ్ పై సమర్ధవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ నిలవనుంది. ఈ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

