మనుషుల ప్రాణాలు తీయడానికి జీ4.. మరో కొత్త వైరస్

మనుషుల ప్రాణాలు తీయడానికి జీ4.. మరో కొత్త వైరస్

అప్పుడే ఏమైంది.. ముందుంది మొస్సళ్ల పండగ అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.. ఓ పక్క ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఇంకో కొత్త వైరస్ జీ4 వస్తోంది అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం లేకున్నా భవిష్యత్తులో మాత్రం కరోనాని తలపిస్తుందని అంటున్నారు. మొదట జీ 4 వైరస్ ని పందుల్లో గుర్తించారు. సాధారణంగా పందుల్లో పక్షి సంబంధ, ఇటు క్షీరద సంబంధ వైరస్ లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్ లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒక దాంట్లోని జన్యువులు మరొక దాన్లోకి చేరుతుంటాయి.

ఫలితంగా కొత్త రకాల వైరస్ లు పుడుతుంటాయి. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ4 ఉనికి వెలుగు చూసింది. ఈ వైరస్ లో మూడు ఇన్ ప్లుయెంజా కారక వైరస్ ల జన్యుపదార్థం కలిసిపోయి ఉంది. యూరప్ ఆసియా పక్షుల్లోని వైరస్ ఒకటి కాగా, ఎగిరే పక్షులు, మనుషులు, పందుల వైరస్ లు కలిగి ఉన్న నార్త్ అమెరికన్ రకం మరొకటి.

హోంగ్లీసన్ పరిశోధనల్లో జీ4 తో పాటు కనీసం 179 ఇన్ ప్లుయెంజా కారక వైరస్ లు ఉన్నాయని అంటున్నారు. అయితే జీ4 కూడా మనుషులకు సోకుతున్నా కరోనా వైరస్ మాదిరి విస్తృతంగా వ్యాపించ లేదని అన్నారు. కానీ భవిష్యత్తులో జీ4 వైరస్ కేసులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పందులను పెంచే ప్రదేశాల్లో ఈ జీ4 వైరస్ యాంటీబాడీలు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story