కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఢిల్లీలోని పాలమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహేందర్ యాదవ్ కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మృతి చెందాడు. మహేందర్ యాదవ్ వయస్సు 70 సంవత్సరాలు. 1984 సిక్కు అల్లర్ల కేసులో ఆయనకు 10 ఏళ్లు శిక్ష పడింది. దీంతో 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్‌లో ఉంటున్నాడు. ఇదే బ్యారక్‌లో ఉంటున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ జూన్ 15న మృతి చెందాడు. దీంతో శవపరీక్ష నిర్వహించగా ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆ బ్యారక్‌లో ఉంటున్న 29మంది వృద్ధ ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో మహేందర్ యాదవ్‌తో సహా అందరికీ పాజిటివ్ వచ్చింది. జూన్ 26న మహేందర్ యాదవ్‌ను ఢిల్లీలోని డీడీయూ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహేందర్ యాదవ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com