నేపాల్ ప్రధాని రాజీనామా ఉంటుందా?

నేపాల్ ప్రధాని రాజీనామా ఉంటుందా?
X

గత కొద్దిరోజులుగా నేపాల్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) స్టాండింగ్ కమిటీకి చెందిన 40 మంది నాయకులలో 33 మంది ఒలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కీలక సమావేశం జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు. కెపి శర్మ ఒలి తన పదవిని కాపాడుకోడం కోసం సీనియర్ నేతలందరినీ కలిసి మద్దతు కూడగట్టినా లాభం లేకుండా పోయింది. దీంతో చివరి ప్రయత్నంగా ఆదివారం ఆర్మీ చీఫ్‌ను కలిశారు, ఒలి తన అధికారాన్ని నిలుపుకోవటానికి ఆర్డినెన్స్ ప్రకటించడంతో సహా కొన్ని కఠినమైన చర్యలకు ఆయన వెళ్లవచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అంతేకాదు గత రెండు రోజుల వ్యవధిలో ఆర్మీ చీఫ్‌ తో భేటీ అవ్వడం వరుసగా ఇది రెండోసారి.

మరోవైపు మాజీ ప్రధాని, పార్టీ కోచైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ తోను భేటీ అయ్యారు. ఆ తరువాతే పార్టీ కార్యనిర్వాహక అధికారాలను ప్రచండకు అప్పగించడానికి సుముఖంగా ఉన్నానని, అయితే పదవులను వదులుకునే మానసిక స్థితిలో లేనని ఓలీ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఒలి, ప్రచండలు విడిపోవడానికి సానుకూలంగా ఉన్నారని.. అయితే ఎన్‌సిపి ప్రధాన కార్యదర్శి బిష్ణు పాడెల్ సహా ఇతర నాయకులు జోక్యం చేసుకుని సోమవారం ఉదయం వరకు సమయం కేటాయించాలని కోరారు. దీంతో ఒలి ప్రధాని పదవి నుంచి దిగిపోయేది లేనిదీ ఇవాళ తేలుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా నేపాల్ లో ఈ పరిస్థితులు రావడానికి ఒలి యే కారణమని.. కరోనాను అధిగమించడంలో ఒలి విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే ఇటీవల తలెత్తిన భారతదేశం ,చైనా మధ్య వివాదంలో అనవసరంగా తలదూర్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story