ఆన్‌లైన్ లో చదువులా.. అయితే అమెరికాలో ఎందుకు ఉండడం వెళ్లిపోండి: ట్రంప్ సర్కార్

అగ్రరాజ్యం అమెరికాలో ఆన్‌లైన్ లో వివిధ కోర్సులు అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులపై పిడుగుపడే వార్త చెప్పారు అధ్యక్షుడు ట్రంప్. సెప్టెంబర్, డిసెంబర్ సెమిస్టర్లను ఆన్‌లైన్ లో చదవాలనుకునే విద్యార్ధులు దేశం విడిచి వెళ్లాలని అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశం విడిచి అయినా వెళ్లండి. లేదంటే సంబంధిత యూనివర్శిటీ క్యాంపస్ లో అయినా ఉండి చదువుకోండి అని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఐసీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువ నష్టపోయేది ముందు చైనా అయితే ఆ తరువాతి స్థానంలో భారత్ ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో దాదాపు 12 లక్షల మంది వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు 8700 విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. అందులో అత్యధికంగా చైనా విద్యార్థులు ఉంటే.. భారతీయ విద్యార్థులు మూడు లక్షల 60వేల మంది ఉన్నారు. తాజా ఉత్తర్వుల ప్రభావం వీరిపై తీవ్రంగా పడనుంది. ఇప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో సహా మరికొన్ని విద్యాలయాలు ఆన్‌లైన్ లో తరువాతి సెమిస్టర్ లను నిర్వహించాలనుకుంటోంది. పోనీ తాజా ఉత్తర్వుల ప్రకారం స్వదేశాలకు వెళ్లి మళ్లీ పరీక్షల టైమ్ కి అమెరికా రావచ్చా అంటే అదీ సందేహమే.. అన్నిటికీ కారణం కరోనాయే.
ప్రపంచ వ్యాప్తంగా చాలా రాయబార కార్యాలయాల్లో వీసా ప్రక్రియను అమెరికా నిలుపుదల చేసింది. దీంతో అమెరికా తిరిగి వెళ్లడం కష్టమే. ఇక ఇప్పుడు మరో మార్గం లేదు పాఠాలు బోధించే విద్యాలయాలకు మారిపోవడమే వారిముందున్న ప్రస్తుత కర్తవ్యం. అంతర్జాతీయ విద్యార్థులు తరలిపోతే విశ్వవిద్యాలయాలు కూడా ఆర్థికంగా నష్టపోతాయి. అయితే ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలోని విద్యాలయాలు తీవ్రంగా తప్పుబడతున్నాయి. తాజా నిర్ణయంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆమోదించతగినది కాదని అమెరికా సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com