వైరస్ నుంచి రక్షణకు వైజాగ్ నిపుణుల సృష్టి.. 'నానో మాస్క్-99'

వ్యాక్సిన్ వచ్చే లోపు కరోనా నుంచి రక్షించుకునేందు మాస్కులు ధరించడం అనేది అత్యవసరం. సామాజిక దూరం సంగతి పక్కన పెట్టినా మాస్క్ తో మహమ్మారిని దరి చేరనివ్వకుండా మనల్ని మనం కాపాడు కోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం విన్నవించింది. ఈ నేపథ్యంలో మనం ధరించే మాస్క్ మరింత సురక్షితంగా ఉండడం చాలా అవసరం. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖకు చెందిన సాంకేతిక నిపుణులు నానో మాస్క్ ను రూపొందించారు.
ఇది ఎన్ -95 మాస్క్ కంటే ఎంతో ప్రయోజనకారి అని మాస్క్ తయారీలో భాగస్వామ్యులైన దిల్లీ ఐఐటీలో ఎంటర్ ప్రెన్యూర్ సెల్ విభాగ మాజీ సభ్యుడు కేవీ రమణ, ఆంధ్ర విశ్వవిద్యాలయ జియో ఇంజనీరింగ్ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలో డాక్టర్ దేముడు, ఎం.ఎస్.ఆర్.లెదర్ ఇండస్ట్రీకి చెందిన శేషగిరిరావు చెప్పారు. దీనికి నానో ఫోటానిక్ ఫిల్టర్ (ఎన్.పి.ఎఫ్) మాస్క్-99 అని పేరు పెట్టారు. వీరు కొన్ని నమూనా మాస్కులను రూపొందించి దిల్లీలోని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ తో పాటు ఐ.సి.ఎం.ఆర్ కు నివేదికలు పంపారు. వారి నుంచి అనుమతులు వచ్చిన అనంతరం ఈ మాస్కులను మార్కెట్లోకి తీసుకువస్తారు.
అయిదు పొరలతో రూపొందించిన ఈ మాస్క్ మొదటి పొర సింథసైజ్డ్ నానో మెటాలిక్ పదార్థాన్ని కోటింగ్ గా వాడితే.. రెండో పొరలో సింథసైజ్డ్ ఫొటానిక్, మూడో పొర రక్షణ పొరగా.. నాలుగో పొర సింథసైజ్డ్ నైలాన్ ఫ్యాబ్రిక్ పొర, అయిదు కాటన్ సింథసైజ్డ్ ఫ్యాబ్రిక్ పొరలతో ఉండి వైరస్ నుంచి కాపాడేలాగా తీర్చిదిద్దారు. వీటన్నింటినీ దాటుకుని వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు 99 శాతం తగ్గుతుంది. ఒక వేళ వైరస్ మాస్క్ లోనికి చొచ్చుకుని వస్తే మాస్క్ పై అమర్చిన పదార్థాల కారణంగా అవి చనిపోతాయి. మాస్క్ లో ఒక నానో చిప్, నానో బ్యాటరీ ఉంటాయి. గంట పాటు ఛార్జి చేస్తే 8 గంటలు బ్యాటరీ పని చేస్తుంది. దీన్ని నిరంతరాయంగా 6 నెలలు వాడుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com