కొవిడ్ నాకూ వచ్చింది.. 'పాజిటివ్' దృక్పథంతో కోలుకున్నాను: హైదరాబాద్ సిటీ అడిషనల్ కమిషనర్

కొవిడ్ నాకూ వచ్చింది.. పాజిటివ్ దృక్పథంతో కోలుకున్నాను: హైదరాబాద్ సిటీ అడిషనల్ కమిషనర్
X

ఆత్మస్థైర్యం అన్నింటినీ జయించేలా చేస్తుంది.. మనోధైర్యమే మనల్ని మనిషిగా నిలబెడుతుంది.. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని అవలీలగా అధిరోహించగలుగుతాము. భార్యగా, తల్లిగా, కూతురిగా, అన్నిటీకి మించి ఓ సిటీ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతాయుతమైన వృత్తిలో పని చేస్తూ కొవిడ్ బారిన పడినా కృంగిపోలేదు. ధైర్యంగా 'పాజిటివ్' ధృక్పథంతో మహమ్మారిని జయించారు. మరెందరో కరోనా పేషంట్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మన హైదరాబాద్ సిటీ అడిషనల్ డీజీ షికా గోయల్.

పక్క వాళ్లకి వచ్చిందంటేనే భయం.. మనకి వస్తే మరీ భయం.. ఆ భయమే మనల్ని మరింత కృంగదీస్తుంది అంటున్నారు షికా గోయల్. పదిహేను రోజుల ఐసోలేషన్ తరువాత పూర్తిగా కోలుకుని మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. ఆమె తన క్వారంటైన్ అనుభవాలను పంచుకున్నారు.

నాకు కొవిడ్ వచ్చిందని తెలియగానే ముందు ఓ రెండు నిమిషాలు బాధపడ్డాను. వెంటనే తేరుకుని ధైర్యం తెచ్చుకున్నాను. జాగ్రత్తలు తీసుకుంటే జయించగలనని అనుకున్నాను. వెంటనే డాక్టరు గారికి ఫోన్ చేసి నాకు కరోనా వచ్చింది ఏం చేయాలని అడిగాను.. భయపడాల్సిందేమీ లేదు.. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. దాంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే ఆ విషయాన్ని నా కుటుంబసభ్యులకు, ఉన్నతాధికారులకు తెలియజేశాను. ప్రతి రెండు రోజులకు ఒకసారి డీజీపీ మహేందర్ రెడ్డిగారు, సీపీ అంజనీ కుమార్ గారు, మిగిలిన అధికారులు ఫోన్ చేసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకునే వారు. దీని వలన నాకందరూ ఉన్నారన్న భావన, ఏదో తెలియని ధైర్యం నన్ను ముందుకు నడిపించింది.

నాకు వైరస్ వచ్చిందని తెలిసిన రోజే ఢిల్లీ నుంచి నాన్న వచ్చారు. అయినా ఆయన్ని కలవకుండా వేరే రూములో ఉన్నాను. వీడియో కాల్ లో నాన్న యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. నా పిల్లలతో రోజూ వీడియో గేమ్స్ ఆడేదాన్ని. కొవిడ్ గురించిన సమాచారం గురించి గూగుల్ లో సెర్చ్ చేయలేదు. రోజూ గోరువెచ్చని నీళ్లు తాగే అలవాటు ఎలాగూ ఉంది. దాంతో పాటు రోజూ వేడి నీళ్లలో ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించేదాన్ని. అలాగే గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె, తులసి ఆకులు వేసుకుని తాగాను. డాక్టర్లు చెప్పినట్లు విటమిన్ సప్లిమెంట్స్ వాడాను. తులసి ఆకులు, అల్లం, పసుపు వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకున్నాను. చ్యవన్ ప్రాశ్ తీసుకునేదాన్ని. భోజనంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకునేదాన్ని. అన్నిటికీ మించి పాజిటివ్ ధృక్పథం చాలా ముఖ్యం.

జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇది కూడా అలాంటి ఒక సమస్యే అనుకుంటే త్వరగా కోలుకుంటాము. పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళితే షుగర్, బీపీ, గుండెజబ్బులు వంటి సమస్యలు ఉన్నా కోవిడ్ నుంచి కోలుకోవచ్చు.

ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయింది కదా.. మళ్లీ రాదు అని అనుకోవడానికి లేదు.. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. మాస్కులు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. చేతులు తరచు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అనవసరంగా బయటకు వెళ్లకూడదు.

అన్నిటికీ మించి కరోనా వచ్చినా ఖాళీగా ఉండకూడదు. అదే ఆలోచిస్తూ ఉంటే మరింత నీరసం వస్తుంది. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఆఫీసుకు వెళ్లకపోయినా అధికారులతో మాట్లాడుతూ నా పనికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకునేదాన్ని. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేసేదాన్ని. పుస్తకాలు చదివాను. కొవిడ్ గురించి ఆందోళన పడే సమయం లేకుండా గడిపాను. 90 శాతం మందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుంది. ఆందోళన చెందకుండా డాక్టర్ సలహాతో మందులు వాడితే సరిపోతుంది.

Tags

Next Story