ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి, మహారాజ్‌గంజ్‌ మాజీ ఎమ్మెల్యే పీ రామస్వామి కన్నుమూశారు. 87 ఏళ్ల రామాస్వామి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. రామాస్వామి హైదరాబాద్‌‌లోని మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో వైద్యశాలలో చేరారు. డయాలసిస్‌ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

రామస్వామి 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఆయన గడ్డం రామస్వామిగా గుర్తింపు పొందారు. 1960లో క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1964లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1983లో మహరాజ్‌గంజ్‌ నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వంలో నెల రోజుల పాటు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బీజేపీలో చేరారు. 1994లో బీజేపీ తరఫున అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రామస్వామి మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. అటు రామస్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story