టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత సంవత్సరంలో 40 వేల మంది సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
వీరందరిని క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారానే ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి వివరించారు. గతేడాది ఇంతే స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్న సంస్థ.. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో నైపుణ్యం ఎక్కువ ఉన్నవారిని రిక్రూట్ చేసుకోనున్నట్టు కంపెనీ ఈవీపీ, గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ మిలింద్ లకాడ్ పేర్కొన్నారు.
అలాగే హెచ్-1బీ, ఎల్-1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అమెరికాలో 2 వేల మందిని అక్కడి క్యాంపస్‌ల నుంచి నియమించుకోనున్నట్లు తెలిపారు. గతేడాది నియమించుకున్న ఫ్రెషర్లు ఈ నెల చివరి నాటికి ఉద్యోగాల్లో చేరనున్నారని, వీరిలో 87 శాతం మంది యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. వీరితోపాటు 100 మంది అనుభవం ఉన్నవారిని సైతం నియమించుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com