గవర్నర్‌ను కలిసిన అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ లో సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా తొలగించిన తరువాత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం గవర్నర్ కలరాజ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సచిన్ పైలట్ సహా ఇద్దరు మంత్రులు తొలగింపుపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గవర్నర్‌కు వివరించారు. నూతన మంత్రివర్గం ఏర్పాటుపై కూడా రాజ్ భవన్‌లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ గవర్నర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక అంతకుముందు, రాజస్థాన్ సంక్షోభంపై బలమైన చర్యలు తీసుకున్న కాంగ్రెస్ వెంటనే పైలట్‌తో పాటు ఆయన శిబిరంలో ఉన్న ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను పదవుల నుంచి తొలగించింది. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవుల నుంచి తొలగించినట్లు పార్టీ జాతీయ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com