సి-విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారా!!

కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే డి విటమిన్, సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇవి సహజంగా సూర్యరశ్మి నుంచి, పండ్ల నుంచి లభిస్తుందని చెబుతున్నారు. డాక్టర్ సలహా మేరకు విటమిన్ టాబ్లెట్ల కొనుగోలు కోసం మెడికల్ షాపులకు వెళుతున్నారు. దాంతో తీవ్రస్థాయిలో విటమిన్ టాబ్లెట్ల కొరత ఏర్పడిందని మెడికల్ షాపుల యజమానులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మల్టీ విటమిన్, సి-విటమిన్ ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో రకరకాల వివిధ కంపెనీల విటమిన్లు దొరుకుతున్నా వైద్యులు సూచించిన కంపెనీవే కావాలంటూ అవసరానికంటే ఎక్కువ కొనేస్తున్నారు మళ్లీ కొరత ఏర్పడుతుందేమో అని భావించి. దీంతో నిజంగా అత్యవసరమయ్యే వాళ్లకి విటమిన్ టాబ్లెట్లు అందడం లేదు. బ్రాండ్ కి విలువ పెరగడంతో ఒకప్పుడు రూ.14 ఉన్న సి విటమిన్ టాబ్లెట్ ధర ఇప్పుడు రూ.70కి చేరుకుంది. వీలైనంత వరకు విటమిన్లను ఆహార రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించాలి. అత్యవసరమైతే తప్ప టాబ్లెట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు వైద్యులు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే సి విటమిన్ వుండే పండ్లు, పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు వైద్యులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com