జియో ఫ్లాట్‌ఫామ్స్‌కు పెట్టుబడుల వరద..

జియో ఫ్లాట్‌ఫామ్స్‌కు పెట్టుబడుల వరద..
X

జియో ఫ్లాట్‌ఫామ్స్‌కు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. గత 12 వారాల్లో రిలయన్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌కు 13 పెట్టుబడులు రాగా, తాజాగా ఇన్వెస్ట్‌ చేసేందుకు గూగుల్‌ ముందుకొచ్చింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో డిజిటల్‌ విభాగమైన జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. తాజాగా సర్చ్‌ ఇంజిన్‌ గూగుల్ పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7శాతం వాటా కోసం రూ.33,737 కోట్లను గూగుల్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది.

ఇప్పటికే వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గూగుల్‌ మధ్య చర్చలు జరిగాయి. మరికొన్ని వారాల్లో ఈ ఒప్పందం పూర్తవుతుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఇప్పటికే జియోలో 13 కంపెనీలు కలిపి 25.24 శాతం వాటా కోసం రూ.1,18,318.45 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. తాజాగా గూగుల్‌ డీల్‌తో కలిపి రిలయన్స్‌ ప్లాట్‌ఫామ్‌లో 32.94 శాతం విక్రయించినట్లయింది. అలాగే మొత్తం పెట్టుబడులు రూ.1.52 లక్షల కోట్లను అధిగమించాయి.

ఇక వచ్చే 5-7 సంవత్సరాల్లో భారత్‌లో రూ.75వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత డిజిటల్‌ వ్యవస్థలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించిన గూగుల్‌ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Tags

Next Story