ఇక ఆ దేవుడే రక్షించాలి..

ఇక ఆ దేవుడే రక్షించాలి..
X

కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వ్యాప్తి నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఇక ఆ దేవుడే ఈ వైరస్ బారినుండి ప్రజలను రక్షించాలి అని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములు అన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రజల సహకారం ముఖ్యమైనదని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ అభియోగానికి ప్రతిస్పందనగా బుధవారం చిత్రదుర్గలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. వ్యాధిని నియంత్రించడం ఎవరి చేతుల్లో ఉంది. ప్రజల్లో అవగాహన రావాలి అని అన్నారు.

రాబోయే రెండు నెలల్లో వైరస్ వ్యాప్తి మరింత విజృంభిస్తుందని, కరోనాకు పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య భేదం లేదని ఆరోగ్య మంత్రి అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, మంత్రుల బాధ్యతారాహిత్యం, వారి మధ్య విభేదాలు అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు సత్యదూరమని ఆయన పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 3,176 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు నమోదైన కేసులు 47,253 కాగా 18,466 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 27,853 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story