క్వారంటైన్ సెంటర్లో ప్రియుడితో కలిసి లేడీ కానిస్టేబుల్..

నాకూ పాజిటివ్.. నా భర్తకీ పాజిటివ్.. ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉంటామంటే ఎలాగూ భార్యాభర్తలే కదా అని అధికారులు పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు. అందునా పోలీస్ కానిస్టేబుల్.. ఏమాత్రం అనుమానం రాలేదు డిపార్ట్ మెంట్ కి. దాంతో ముచ్చటగా మూడు రోజులు గడిచే సరికి అసలు భార్య పరిగెట్టుకుంటూ వచ్చింది.
నాగపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నఓ మహిళా కానిస్టేబుల్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె క్వారంటైన్ కి వెళ్లాల్సి వచ్చింది. అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఓ వ్యక్తిని తీసుకొచ్చి అతడు తన భర్త అని ఇద్దరం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమతించమని అధికారులను కోరింది. దాంతో వారిద్దరికీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఓ గదిని కేటాయించారు. కాగా, ఆ విషయం తెలియని సదరు ప్రియుడి అసలు భార్య మూడు రోజుల నుంచి నా భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో భర్త అక్రమ సంబంధం గురించి, క్వారంటైన్ లో ఉన్నాడని ఆమె తెలుసుకుంది.
దీంతో తాడో పేడో తేల్చుకుందామని క్వారంటైన్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె నేరుగా కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ్ ని కలిసి వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, లేడీ కానిస్టేబుల్ కి తపాల శాఖ వ్యక్తి ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఓ అధికారి వెల్లడించారు. విషయం తెలియడంతో ఇద్దరినీ వేరు వేరు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com