మీరు మా ఇంటికి రాకండి.. మమ్మల్ని మీ ఇంటికి రమ్మనకండి

మీరు మా ఇంటికి రాకండి.. మమ్మల్ని మీ ఇంటికి రమ్మనకండి

దిస్ ఈజ్ పార్టీ టైమ్ లాగా.. ఇది కరోనా సమయం.. మొహమాటానికి పోతే కరోనా మన నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. వాళ్లింటికి వెళితే మనకి రావచ్చు. లేదా మనవల్ల వాళ్లకి రావచ్చు. ఎందుకొచ్చిన గొడవ. ఎవరింట్లో వాళ్లు ఉంటే సరిపోతుంది. అందుకే ఇలా బోర్డు పెట్టాము అని అంటున్నారు హైదరాబాదులోని ఓ కాలనీ వాసులు. ఇలా చేయడం భావ్యం కాదని తెలిసినా అందరూ బావుండాలంటే తప్పదు కదా అని అంటున్నారు. నిజమే కదా అని అనిపించకమానదు.

వైరస్ సోకినా లక్షణాలు లేనివాళ్లు ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతున్నారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన 2,200 మంది ప్రభుత్వ అధికారులకు సహకరించకుండా మిస్సింగ్ లిస్టులో ఉంటున్నారని ఓ సర్వే రిపోర్ట్. ఈ పరిస్థితిలో వైరస్ బారిన పడకుండా ఉండాలని కొందరు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అనుకోకుండా ఎవరైనా గెస్ట్ లు వస్తే అనుమానంగా చూడాల్సివస్తుంది. ముషీరాబాద్ బోలక్ పూర్ డివిజన్ లోని పద్మశాలీ కాలనీ వాసులు తమను, తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు వినూత్న పద్దతిలో కాలనీకి బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.

ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన ఈ కాలనీవాసులు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. తమ ఇంటికి రావొద్దని బోర్డులు తగిలించి ప్రతి ఒక్కరికీ చెప్పకనే చెబుతున్నారు. ఈ నిబంధన బంధువులు, మిత్రులు, పరిచయం లేని వ్యక్తులందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు. మహమ్మారి కరోనా సమసిపోయే వరకు ఇదే రకమైన ఒరవడిని కొనసాగిస్తామని అంటున్నారు. ఇంటికి రావద్దని చెప్పడం మాకు సుతారమూ ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు.. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story