అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు

వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 5న ప్రధాన మంత్రి చేతుల మీదుగా మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. దీంతో శతాబ్దాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీరాముడి భక్తుల కల నెరవేరనుంది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 5న రామ మందిర శంకుస్థాపనకు రావాలని ప్రధానికి ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే విన్నవించారు. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు
రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ఇక ఆలయ నిర్మాణం కోసం లారెన్స్ అండ్ టర్బో సంస్థ మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఆలయ నమూనాలను సిద్ధం చేస్తోంది. అవి సిద్ధమవ్వగానే వాటి ఆధారంగా ఆలయాన్ని నిర్మించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. వర్షాకాలం తరువాత దేశంలోని నాలుగు లక్షల ప్రాంతాల్లో పదికోట్ల కుటుంబాలను సంప్రదించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్ వివరించారు. దేశంలోని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక విరాళాలు సేకరించనున్నట్లు ఆయన తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com